కంగ్టి, అక్టోబర్ 12:పోలియో చుక్కల మందు వికటించి 3 నెలల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధితుల వివరాల ప్రకారం.. భీంరా గ్రామానికి చెందిన స్వర్ణలత-ఉమాకాంత్ దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. ఆదివారం బాలుడికి పోలి యో చుక్కలు వేయించారు. వేసిన 20 నిమిషాల్లోనే వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. వెంటనే కంగ్టిలోని దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు.
పోలియో చుక్కలు వికటించడం వల్లే చిన్నారి మృతిచెందినట్టు గ్రామస్థులు ఆరోపించారు. పోలియో మందు వికటించి చిన్నారి మృతిచెందడం అనేది అవాస్తవమని వైద్యాధికారి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందినట్టు నారాయణఖేడ్ మా జీ ఎమ్మెల్యే ఎం భూపాల్‌రెడ్డి ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.