జగిత్యాల, అక్టోబర్ 12: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు బీసీలపై కపట ప్రేమ చూపుతున్నదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ధ్వజమెత్తారు. బీసీ కులాలను ఆశల పల్లకీలో నెట్టి.. చెల్లని జీవోతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో బీసీల కోసం చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని ఆగ్రహించారు. ఈ మేరకు జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలి సీఎం కేసీఆర్ బీసీల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.
గంగపుత్ర, ముదిరాజ్‌లకు చేపల పిల్లల పంపిణీ, గౌడన్నలకు చెట్టు పన్ను మాఫీ, ప్రమాదవశాత్తూ మరణిస్తే 5లక్షల బీమా, యాదవులకు గొర్రెల పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి బీసీలకు కార్పొరేట్ స్థాయిలో విద్య, నాణ్యమైన భోజనం అందించారని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలు కనుమరుగయ్యాయని విమర్శించారు. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీలను వాడుకుంటుందని ఆరోపించారు. జీవో నంబర్ 9తో ఎన్నికలకు ఎలా వెళ్తారానే సోయి అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీ పెద్దలకు లేకపోవడం విచారకరమన్నారు.
బీసీలకు రాజ్యాంగ పరంగా హకులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కానీ, సుప్రీంకోర్టు నెపంతో మరోసారి ఎన్నికల వాయిదా కోసం ప్రభుత్వమే కృషి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా బీసీ సమాజం మేలొని కాంగ్రెస్ కపట వైఖరిని గమనించాలని కోరారు. బీసీల చైతన్యంతోనే రాజ్యాధికారం సాధ్యమని, ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని, ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆనంద్‌రావు, మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బందేల శేఖర్, మహేశ్‌గౌడ్, రాకేశ్, వెంకటేశ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.