వానకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే పల్లెల్లో కోతలు మొదలు కాగా, కొనుగోళ్లు ప్రారంభించడంతో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తున్నది. పైగా పోయిన సీజన్‌తో పోలిస్తే.. సేకరణ లక్ష్యానికి కోత పెట్టడంతోపాటు కొనుగోలు కేంద్రాలను తగ్గించింది. కరీంనగర్ జిల్లాలో ఈ సారి 5.97 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముండగా, గతేడాది లక్ష్యానికి లక్ష మెట్రిక్ టన్నులు తగ్గించి 3.01 లక్షల మెట్రిక్ టన్నులే కొనేందుకు ఏర్పాట్లు చేయడం, సెంటర్లను 340 నుంచి 325కు కుదించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఈ తగ్గింపు వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా.. కొనుగోళ్లు ఆలస్యం కావడం, కేంద్రాలను తగ్గించడం చూస్తే రైతులు మళ్లీ దళారుల చేతిలో నష్టపోయే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తున్నది. మరోవైపు పెద్ద మొత్తంలో మిగిలిపోతున్న ధాన్యాన్ని మిల్లర్లు కొంటారా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ్రామస్థాయిలోనే కొనుగోళ్లు జరిగేలా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా చివరి ధాన్యం గింజ వరకూ కొన్నది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గతేడాది కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో చాలా మంది రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. సన్నరకాలు సాగు చేస్తే బోనస్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, తీరా సమయానికి కొనుగోలు కేంద్రాలు తెరవక పోవడంతో అగ్గువకే విక్రయించారు. మిల్లర్లతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వ్యాపారులకు పచ్చి వడ్లనే అమ్ముకున్నారు.
ప్రభుత్వంపై భరోసా లేక దొడ్డురకం వడ్లను కూడా 1,800కే క్వింటాలు చొప్పున అమ్మేసుకున్నారు. క్వింటాలకు 500కుపైగా నష్టపోయారు. ప్రస్తుతం అధికారులు జిల్లాల వారీగా తయారు చేసిన వానకాలం ప్రణాళికలను చూస్తే ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రైతులు ఎక్కువగా మిల్లర్లకే విక్రయించుకునేలా రూపొందించనట్టు తెలుస్తున్నది. మిల్లర్లకు నేరుగా విక్రయిస్తే కనీస మద్దతు ధర రాదు. రైతులు నిలువు దోపిడీకి గురికాక తప్పదు. ఈ సారి ప్రణాళికా లక్ష్యం తగ్గించడంతో రైతులు విధి లేక మిల్లర్లను ఆశ్రయించే పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తున్నది. ఇదే జరిగితే రైతులను నిలువు దోపిడీకి గురయ్యే ముప్పు ఉన్నది. గత వానకాలం సీజన్లో కరీంనగర్ జిల్లాలో సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ సారి ప్రభుత్వమే లక్ష్యాన్ని తగ్గించడంతో 1.50 నుంచి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారా..? అనేది ఇపుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
కరీంనగర్ జిల్లాలో 3 లక్ష మెట్రిక్ టన్నులే!
జిల్లాలో ఈ వానకాలంలో మొత్తం 2,75,398 ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో 1,57,929 ఎకరాల్లో దొడ్డు రకం, 1,17,469 ఎకరాల్లో సన్నరకం వేశారు. 3,57,274 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 2,40,072 మెట్రిక్ టన్నుల సన్న రకాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారలు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పౌర సరఫరాల సంస్థ అధికారులు కొనుగోళ్ల ప్రణాళికను రూపొందిస్తారు. స్థానిక అవసరాలు, సీడ్ అవసరాలకుపోను, మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసే ధాన్యాన్ని అంచనా వేసి, సంస్థ ఎంత కొనుగోలు చేయాలో నిర్ణయిస్తారు. సన్న, దొడ్డు రకాలు కలిపి ఈ సారి 5,97,346 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముండగా, అందులో 3,01,880 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సన్న, దొడ్డు రకం కలిపి గతేడాది 5.66 మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేసి, 4.01 మెట్రిక్ టన్నులు కొనేందుకు సివిల్ ప్రణాళిక చేశారు.
ఈ సారి అంతకంటే ఎక్కువ ధాన్యం వస్తుందని అంచనా వేసి, కేవలం 3,01,880 మెట్రిక్ టన్నులకే ప్రణాళిక చేయడం అనుమానాలకు తావిస్తున్నది. స్థానిక అవసరాలకు 55 నుంచి 60 వేల మెట్రిక్ టన్నులు, సీడ్ అసవరాలకు 75 నుంచి 80వేల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుంది. మిల్లర్లు 30 నుంచి 35 వేల మెట్రిక్ టన్నులు నేరుగా కొనుగోలు చేసినా అధికారులు కొనాల్సింది సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నులకు మీదనే ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం కేవలం 3లక్షల మెట్రిక్ టన్నులకే ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కేంద్రాలు నెలకొల్పడం, టార్పాలిన్లు సమకూర్చుకోవడం, గన్నీ బ్యాగులు సేకరించుకోవడం, రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవడం, గోదాముల సర్దుబాటు తదితర ఏర్పాట్లన్నీ ఈ మేరకే జరుగుతాయి. లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్ష్యం మేరకు కొనుగోలు జరిగిన తర్వాత కేంద్రాలు మూసివేస్తే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. ఈ సారి కొనుగోలు కేంద్రాలను కూడా తగ్గించారు. గతేడాది 340 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ సారి 325కే పరిమితం చేశారు. ఎక్కడ కేంద్రాలు తగ్గిస్తారనే విషయంలో స్పష్టత లేదు. కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతోనే కేంద్రాలను కుదించారనేది స్పష్టంగా తెలుస్తున్నది.
కొనుగోలు కేంద్రాలు తెరిచేదెప్పుడు?
గతేడాది మాదిరిగానే ప్రభుత్వం కావాలనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కోతలు మొదలైనా, ఇప్పటి వరకు కేంద్రాలు మాత్రం ప్రారంభించలేదు. గతేడాది అక్టోబర్ 13న తిమ్మాపూర్ మండలం రేణికుంట, మానకొండూర్‌లో రెండు కేంద్రాలు ప్రారంభించినా.. ఈ సారి అది కూడా లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాలో ఈ సారి 101 ఐకేపీ, 184 ప్యాక్స్, 36 డీసీఎమ్మెస్, 4 హాకా ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్కటీ తెరిచింది లేదు. హుజూరాబాద్ డివిజన్లోని హుజూరాబాద్, శంకరపట్నం, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో నీటి సదుపాయం ఉంటుంది.
ఈ మండలాల్లో ముందుగానే వరి నాట్లు వేస్తారు. కోతలు కూడా ముందుగానే ముగిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కోతలు ముమ్మరమైనా, కేంద్రాల జాడ మాత్రం కనిపించడం లేదు. వచ్చే వారంలో కేంద్రాలు తెరుస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే కోతలు చేసి కల్లాల్లో ధాన్యం కుప్పల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తున్నది. కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది. 10,522 టార్పాలిన్లు అవసరం ఉంటే 6,948 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 75.47 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం జిల్లా యంత్రాంగం వద్ద కేవలం 52.29 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 23.18 లక్షల గన్నీ బ్యాగులు సమకూర్చుకోవాల్సి ఉంది.
ఈ సారైనా బోనస్ వచ్చేనా..?
కేంద్ర ప్రభుత్వం ఈ సారి కనీస మద్దతు ధరను 3 శాతం పెంచింది. ఏ గ్రేడు ధాన్యానికి 2,389, సాధారణ రకానికి 2,369 చొప్పున పెంచింది. రైతులు పండించే దొడ్డు, సన్న రకాలకు కూడా ఇదే మద్దతు ధర లభిస్తుంది. సన్నాల సాగుకు పెట్టుబడి, కష్టం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో సన్న రకాలకు ప్రతి క్వింటాల్‌పై 500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. గత యాసంగిలో సన్నాలు విక్రయించిన రైతులకు 16.26 కోట్లు రావాల్సి ఉంది. ఒక్కో రైతుకు లక్షపైగా బోనస్ రావాల్సి ఉంది. ఈ సారి కూడా ఉత్సాహంతో రైతులు సన్నాలను సాగు చేశారు. బోనస్ వస్తుందని అధికారులు చెబుతున్నా, ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం మాత్రం రైతుల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిల్లర్లకు తక్కువ ధరకే విక్రయించుకునే పరిస్థితి రావచ్చని రైతులు వాపోతున్నారు.