కరీంనగర్ విద్యానగర్, అక్టోబర్ 12 : కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన ఫిజీషియన్ల 9వ రాష్ట్ర స్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. కరీంనగర్లో ఈ సదస్సును రెండు సార్లు నిర్వహించడంతోపాటు సక్సెస్ చేయడంపై పలువురు వైద్యుల్లో ఆనందం వ్యక్తమైంది. దేశ వ్యాప్తంగా ఎంతోమంది పేరొందిన వైద్యులు, తమ అనుభవాలను జూనియర్ వైద్యులకు అందించి అవగాహన కల్పించారు. పీజీ విద్యార్థుల కోసం వర్క్‌షాపు, క్విజ్ పోగ్రాం, పేపర్ ప్రజంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య రంగంలో టెక్నాలజీ అవసమరని, సాంకేతిక పెరిగినా హ్యూమన్‌టచ్ తగ్గవద్దని ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలని, మానవీయ కోణంలో చికిత్సలు అందించాలని చెప్పారు.
ఎండీ చదివిన వారందరూ ఫిజీషియన్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని, అన్ని సెమినార్లకు హాజరైతే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చని చెప్పారు. కాన్ఫరెన్స్‌లో సీనియర్ వైద్యులైన నందిని చటార్జి, రవికీర్తి, ఎంవీ రావు, శ్రీనివాస్‌కుమార్, గోపాల కృష్ణ గోఖలే, నర్సింహన్, వసంతకుమార్, నాగార్జున మాటూరి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ తిరుపతిరావు, సెక్రటరీ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ చైతన్య, డాక్టర్ రఘురామన్, డాక్టర్లు సురేశ్, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రశాంతి, నవీనతో పాటు 1200 మందికిపైగా డెలిగేట్స్ పాల్గొన్నారు.
రక్తహీనతను నిర్లక్ష్యం చేయొద్దు
తెలంగాణలో ఎకువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనిని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు. పదిమంది అమ్మాయిల్లో ఏడు నుంచి ఎనిమిది మంది, అబ్బాయిల్లో ముగ్గురు నుంచి నలుగురు, పిల్లల్లో 60 నుంచి 70 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. చాలామంది ఆహార లోపంతోనేనని కొట్టిపారేసి చివరి దశల్లో వైద్యుల వద్దకు వస్తున్నారు. దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే 90 శాతం వ్యాధిని నియంత్రించేందుకు దోహదపడుతుంది. రక్తహీనత ఎకువగా క్యాన్సర్ వ్యాధులకు దారితీస్తుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే బోన్‌మ్యారోతో వ్యాధిని నయం చేయొచ్చు. ఇమ్యునోథెరపీ అనే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. కార్ డీసెల్ ట్రీట్మెంట్ సైతం కృత్రిమంగా సెల్ తయారు చేసి రక్తం వృద్ధి చేసే ట్రీట్మెంట్ సైతం అందుబాటులోకి వచ్చింది. – డాక్టర్ గణేశ్ జైస్వాల్, హెమటాలజిస్ట్ (యశోద హాస్పిటల్ హైటెక్‌సిటీ)
చిక్కర్ పురుగు కాటు వల్ల స్రబ్ టైపస్
స్రబ్ టైపస్ అనేది చికర్ అనే పురుగు కాటు వల్ల వస్తుంది. ఈ పురుగు పల్లెల్లోని పొలాలు, గడ్డి మైదానాలు, అడవుల్లో ఉంటుంది. కాటు వేసిన ఆరు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, తల, కండరాల నొప్పి, వాంతులు, మలబద్దకం ఉంటాయి. కాటు వేసిన చోట ఎచ్చెర్ అనే నల్లటి గాయం ఏర్పడుతుంది. ఈ వ్యాధి ముఖ్య లక్షణం చర్మంపై దద్దుర్లు, లివర్ పెద్దగా కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రపిండాలపై తీవ్రత ఉంటుంది. వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నయం అవుతుంది. కాటు గాయాన్ని గుర్తించి వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. దీనికి అత్యాధునిక చికిత్సలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
– డాక్టర్ సురేశ్, ఫిజీషియన్ (కరీంనగర్)
ఒబెసిటీతో 200 రకాల వ్యాధులు
ఒబెసిటీ అంటే శరీరంలో అధిక కొవ్వు నిల్వ కావడం వలన కలిగే స్థితి. ఇది కేవలం బరువు ఎకువగా ఉండడం మాత్రమే కాదు, ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది 200కు పైగా వ్యాధులకు కారణం అవుతుంది. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్ కొలెస్ట్రాల్ పెరగడం శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు కీళ్లవొప్పులు, హార్మోన్ సమస్యలు మానసిక సమస్యలు ఎకువగా ఉంటాయి. ఒబెసిటీని నియంత్రించాలంటే తకువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎకువ పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ప్రతిరోజూ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు నడక, ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒబెసిటీని తగ్గించుకోవడానికి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇన్సులిన్ లాగే ఒక ఇంజక్షన్ ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉంది. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు ఈ ఇంజక్షన్ తీసుకుంటే అన్ని రోగాలకు దూరంగా ఉండవచ్చు.
– డాక్టర్ రాకేశ్, ఎండోక్రైనాలజిస్ట్ (ఉస్మానియా)
వైద్య రంగంలో టెక్నాలజీ పెరిగింది
వైద్య రంగంలో టెక్నాలజీ పెరిగినా హ్యూమన్‌టచ్ తగ్గకూడదు. టెక్నాలజీని మానవీయ కోణంలో చికిత్సకు ఉపయోగించాలి. గతంలో డాక్టర్ ఒక పేషెంట్‌కు తన అనుభవంతో చికిత్స అందించేవారు. నాడు పేషెంట్‌తో డాక్టర్‌కు మంచి అవినాభావ సంబంధం ఉండేది. ప్రస్తుతం ఈ పరిస్ధితి లేకుండా పోయింది. టెక్నాలజీని మానవ సంబంధం కోసం పెంపొందించాలి. మానవీయ కోణంలో వైద్యం అందించాలి.
– డాక్టర్ చైతన్యరెడ్డి, ఫిజీషియన్ (కరీంనగర్)