హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సినీరంగంపైనా, కొందరు ముఖ్య నటులపై కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యనేత వేధింపులు కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. తాజా పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని సినీపరిశ్రమలోని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపులో ప్రభుత్వం అనుసరించిన ధోరణి చాలా అనుమానాస్పదంగా ఉన్నదని చెప్తున్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సినీపెద్దలు ప్రభాస్‌ను టార్గెట్ చేసి మరీ రాజాసాబ్ రాబడికి గండికొట్టినట్టు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే 8న ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాల టికెట్ రేట్ల పెంపుకోసం తెలంగాణ హోంశాఖ మెమోలు సిద్ధం చేసింది. అదేరోజు రెండింటిని విడుదల చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉన్నదని సినీవర్గాలు చెప్తున్నాయి.
ప్రభాస్ వ్యక్తిగతంగా ముఖ్యనేతను కలువలేదనేది ఓ కారణమైతే, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి నిరుడు నవంబర్‌లో ఓ ప్రైవేట్ ఫంక్షన్లో కేటీఆర్‌ను కలిసి ‘నెక్ట్స్ అధికారం మనదే’ అని చెప్పడం మరో కారణమని ప్రచారం జరుగుతున్నది. మెమోలు రెండూ ఒకేరోజు సిద్ధమైనా రాజాసాబ్ మెమోను అర్ధరాత్రి హడావుడిగా విడుదల చేశారు. ఆ మెమోపై హైకోర్టు స్టే విధించింది. అర్ధరాత్రి మెమోలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. దీంతో ప్రభాస్ సినిమా టికెట్ రేట్ల విషయంలో నిర్మాతకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మెమోను శనివారం ( హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైన రోజు) విడుదల చేసింది. దీంతో సెలవుల కారణంగా విచారణకు రిజిస్ట్రీ అనుమతించలేదు. కోర్టుకు సంక్రాంతి సెలవుల వల్ల చిరంజీవి సినిమా మెమో మీద ఆ సెలవులు ముగిసిన(19) తర్వాత విచారణకు వచ్చే అవకాశమున్నది. ఈ లోపు అధిక రేట్లతో టికెట్లను విక్రయిస్తారు. నిర్మాతలు కలెక్షన్స్ పెంచుకుంటారు. ఇలా ప్లాన్ ప్రకారమే ప్రభాస్ సినిమాను బలిచేసి, చిరంజీవి సినిమాను గట్టెక్కించారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ మీద కొందరు పెద్దలు ఎందుకు ఇంత వివక్షతో వ్యవహరిస్తున్నారని రెబల్‌స్టార్ అభిమానులు మండిపడుతున్నారు.
సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయినప్పటికీ.. సినీపరిశ్రమ వ్యవహారాలు, లెక్కలు అన్నీ ముఖ్యనేత పర్సనల్ విషయాలు చూసుకునే నాయకుడు చక్కబెడుతున్నట్టు తెలుస్తున్నది. సినిమా వాళ్లు ఎవరైనా ముఖ్యనేతను కలిసి ప్రసన్నం చేసుకోవాలని, ఆయన పదేపదే ఒత్తిడి చేస్తూ ఉంటారని సమాచారం. ముఖ్యనేతకు సినిమా వాళ్లతో ఫొటోలు దిగాలన్న సరదా ఏంటో అర్థంకాక.. పరిశ్రమలోని కొందరు పెదవి విరుస్తున్నారు.
ఏదైనా కొత్త సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చినప్పుడో, ముఖ్యనేత పుట్టినరోజునో సినిమావాళ్లు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు చెప్పకపోతే.. ఇక వాళ్ల సినిమాలు ఫినిష్ అనే స్థాయిలో అరాచకం నడుస్తున్నదట. సదరు నాయకుడి అహంకారపూరిత ధోరణితో సినిమా పరిశ్రమ బలవుతున్నదని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొకిసలాట నుంచి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షో అనుమతులపై బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తున్నదని పలువురు వాపోతున్నారు.