హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): అమరుల త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రపంచంలోనే గొప్ప కట్టడంగా నిలువనున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన కొనసాగుతున్న స్మారక చిహ్నం నిర్మాణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. తుది దశలో ఉన్న పనులను సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ద్వారం, ప్రహరీ రెయిలింగ్స్, పార్కింగ్ ఏరియా, పూల మొకలు, పచ్చదనంతో చూపరులకు ఆహ్లాదకరంగా ఉండే ల్యాండ్ సేప్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ ప్రాంగణం, ఫౌంటెయిన్ ఏరియా, తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా నిర్మిస్తున్న ఫొటో ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం, ఆడియో వీడియో విజువల్ స్రీన్ రూం, ఎసలేటర్ పనులు, రెండో ఫ్లోర్లో కన్వెన్షన్ హాలు, మూ డో ఫ్లోర్లో రెస్టారెంట్, కిచెన్ ఏరియా, నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. దుబాయ్ నుంచి తెప్పించిన అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ షీట్స్‌ను దీని నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌గా నిలిచే తుది దశ పనులు మనసుపెట్టి చేయాలని అధికారులు, వర్ ఏజెన్సీని ఆదేశించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, అధికారులు ఉన్నారు.