మహిళా ఉద్యోగులకు ప్రైవేట్ సెక్టార్ పట్టం కడుతున్నది. గత ఆరేళ్లలో వివిధ రంగాల్లో.. ఆడవాళ్ల భాగస్వామ్యం ఆరు శాతం పెరిగింది. మహిళా నియామకాలు 2019లో 26 శాతం ఉండగా.. 2024లో 32 శాతానికి పెరిగినట్లు టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ ‘కెరీర్‌నెట్’ అధ్యయనం తేల్చింది. ఇందుకోసం 2019 నుంచి 2024 క్యాలెండర్ ఇయర్స్‌కు సంబంధించిన 1,80,000 ప్లేస్మెంట్ నమూనాలను విశ్లేషించింది. ఈ సందర్భంగా ‘దేశంలో మహిళల ఉపాధిస్థితి’కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నది.
వివిధ రంగాల్లో మహిళల నియామకాలు ఆరు శాతం పెరిగినట్లు తేల్చింది. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరు (32%), ఢిల్లీ (28%)తోపాటు హైదరాబాద్ (27%) ముందు వరుసలో నిలిచాయి. అదే సమయంలో టైర్-2 నగరాల్లోనూ మహిళా అభ్యర్థుల నియామకాల్లో స్థిరమైన పెరుగుదల నమోదైంది.
గత మూడేళ్లలో ఈ నగరాల్లో 5 శాతం పెరుగుదల కనిపించింది. వివిధ రంగాల విషయానికి వస్తే.. ఐటీ రంగం 29 – 30 శాతంతో స్థిరమైన భాగస్వామ్య రేటును కొనసాగిస్తున్నది. స్టార్టప్స్‌లోనూ.. 2022 నుంచి 2024 వరకు మహిళల భాగస్వామ్యం 9 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడిస్తున్నది. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మహిళల నియామకాల్లో ఫ్రెషర్లే ఆధిపత్యం చలాయిస్తున్నారు.
అయితే, 2023 నుంచి వీరిలోనూ 2 శాతం తగ్గుదల ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 3 నుంచి 12 ఏళ్ల పని అనుభవం ఉన్న మధ్యస్థాయి స్థానాల్లో.. మహిళల నియామకం స్థిరంగా కొనసాగుతున్నది. అదే.. 12 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న సీనియర్ స్థాయిలో .. మహిళల నియామకాలు స్వల్పంగా తగ్గాయి. 2024లో 1 శాతం తగ్గి 19 శాతానికి చేరుకున్నాయి.