హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. పలు ప్రైవేటు సర్వేలతోపాటు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ (Congress) ఓటమిని ఖాయం చేయడంతో ఏం చేయాలో పాలుపోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆందోళనలో మునిగిపోయారు. బీఆర్ఎస్తో పోలిస్తే 5 శాతం వెనకబడినట్టు తాజాగా మరో సర్వే కూడా తేల్చి చెప్పడంతో రేవంత్ తన ఆవేదనను మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ముందు వెల్లడించారు. ఆదివారం వారిని లంచ్ మీటింగ్‌కు పిలిచిన రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో పార్టీ పరిస్థితిని వారికి వివరించి చెప్పినట్టు తెలిసింది.
సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరుపై చర్చించినట్టు సమాచారం. పార్టీ పరంగా ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో బీఆర్ఎస్కు 54 శాతం మంది మద్దతు తెలిపితే, మనం 49 శాతం వద్దే ఆగిపోయామని, బస్తీ ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని వారికి విడమరిచి చెప్పినట్టు తెలిసింది. అలాగే, సర్వే రిపోర్టు ప్రతులను వారికి అందించినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ప్రకారమైతే మనం మరింత వెనుకబడి ఉన్నామని, బీఆర్ఎస్ మనకంటే 6 శాతం ముందుందని చెప్తూ ఆ నివేదికను మంత్రులకు చూపించినట్టు తెలిసింది.
ప్రజలను కలిసి, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని మంత్రులకు డివిజన్ల వారిగా బాధ్యతలు అప్పగిస్తే మీరు షోలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని మంత్రులపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. మొదట్లో కొందరు మంత్రులు నియోజక వర్గంలో హడావుడి చేశారని, తీరా ప్రచార సమయానికి భారా న్ని ఇన్చార్జిల మీద వదిలేసి వెళ్లిపోతున్నారని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇన్చార్జులు కూడా నీడపట్టున కూర్చుని ప్రచార భారాన్ని కార్యకర్తలకు వదిలేశారని, ఇలా అయితే మనం ఎప్పటికీ గెలవలేమని సీఎం ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
మంత్రులు షోలు చేయటం మానేసి కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరగాలని, బూత్ లెవెల్లో ఓటరును నేరుగా కలిసే కార్యక్రమాన్ని రూపొందించాలని మంత్రులని ఆదేశించినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రధానంగా మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ముస్లింలకు స్పష్టంగా తెలియచెప్పాలని సూచించినట్టు సమాచారం.
ప్రచార వేగాన్ని మరింతగా పెంచాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు మల్లు భట్టివిక్రమార, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.