మునుగోడు, సెప్టెంబర్ 22 : గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సమయంలో క్యాటరింగ్ సేవలు అందిస్తున్నామని, క్యాటరింగ్ బిల్లులు మాత్రం ఆరు నెలలుగా చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందుల గురి చేస్తుందని క్యాటరింగ్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నాగరాజు గౌడ్ విమర్శించారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఆగస్టు నెలలో కామన్ టైం టేబుల్ తీసుకొచ్చి విద్యార్థులకు ఉదయం 7 గంటలకే టిఫిన్ అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుగుణంగా క్యాటరింగ్ వాళ్లందరం తెల్లవారుజామున 3 గంటలకే ఎంతో కష్టపడి విద్యార్థులకు ఉదయం 7 గంటలకే టిఫిన్ అందిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం నవంబర్లో విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు మాత్రం పెంచింది. దానికి అనుగుణంగా క్యాటరింగ్ వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు పెంచకపోవడంతో నానా అవస్థలకు గురవుతున్నట్లు వెల్లడించారు. ఇలాగే మరి కొంతకాలం క్యాటరింగ్ వాళ్లని ఇబ్బందులకు గురిచేస్తే ఆత్మహత్యలు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. 2025-2026 విద్యా సంవత్సరంకు ప్రతి విద్యార్థికి రూ.12 మినిమం చార్జీలు క్యాటరింగ్ వాళ్లకు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న ఆరు నెలల బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దసరా సెలవులు తర్వాత స్కూల్ రీ ఓపెనింగ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాటరింగ్ వాళ్లంతా బంద్ చేస్తామని పేర్కొన్నారు.