యాదగిరిగుట్ట, సెప్టెంబర్21: పాడి రైతులకు ఇవ్వాల్సిన 7 పెండింగ్ బిల్లులతో పాటు లీటరుకు రూ. 4 బోనస్ ఇవ్వకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. నార్ముల్ సంస్థకు ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇచ్చిన హామీ మేరకు రూ. 30 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్టలో నార్ముల్ సంస్థ డైరక్టర్ కస్తూరి పాండు, బీఆర్ఎస్ మండల విభాగం ఆధ్వర్యంలో నార్ముల్ సంస్థ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, కందాల అలివేలు రంగారెడ్డి, పాల సంఘం చైర్మన్లు మారెడ్డి కొండల్‌రెడ్డి, సందిళ్ల భాస్కర్ గౌడ్, మాజీ డైరెక్టర్ ఒగ్గు బిక్షపతితో పాటు సుమారు 200 మంది పాల సంఘం చైర్మన్లు, పాడి రైతులు, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, మండ ల పార్టీ అధ్యక్షులు స్థాని క తెలంగాణతల్లి విగ్ర హం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన నార్ముల్ సంస్థ, కేవలం రెండేళ్ల కాలంలోనే ఎందుకు ఇంతగా నష్టపోయిందో చెప్పాలన్నారు. నార్ముల్ చైర్మన్‌గా పనిచేసిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నారు. సంస్థలో 20 ఏళ్లుగా పనిచేసిన 250 మంది కార్మికులను పర్మినెంట్ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
కేసీఆర్ హయాంలో పాడి రైతులకు రూ. 20 కోట్ల గ్రాంట్లు విడుదల చేయించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రోజుకు లక్షాపది వేల లీటర్ల పాలను సేకరించే సంస్థ ఇప్పుడు కేవలం 50 వేల లీటర్లకు పడిపోయిందన్నారు. ఒక్క బిల్లు పెండింగ్ పెట్టకుండా ఇస్తామని ప్రమాణం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సిగ్గు చేటన్నారు. నార్ముల్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అసమర్థత కారణంగా సంస్థ రూ. 70 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఈ నెల 27న జరిగే నార్ముల్ సంస్థ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలన్నారు. అప్పుడే ప్రభుత్వానికి బుద్ధి వస్తుందన్నారు.
పాల సరఫరాను పునరుద్ధరించాలి..
యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు గతంలో మాదిరిగానే నెయ్యి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 40 ఏళ్లుగా యాదగిరిగుట్టకు స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేసిన నార్ముల్ సంస్థను ఎందుకు నిలిపివేయాలని చూస్తున్నారో ముఖ్యమంత్రి పాడి రైతులకు సమాధానం చెప్పాలన్నారు. నెయ్యి సరఫరాను నిలిపివేస్తే సంస్థను మూసివేసే పరిస్థితి వస్తుందన్నారు. సంక్షేమ హాస్టళ్లకు రోజుకు 12 వేల లీటర్ల పాల సరఫరాను ఒక్క జీవోతో రద్దు చేశారని అన్నారు. పెండింగ్ బిల్లులతోపాటు ప్రభుత్వం తరఫున రూ. 30 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని, చేతకాకపోతే మంత్రి కోమరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు.
పాడి రైతుల హామీలను నెరవేర్చకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు సట్టు తిరమలేశ్, గంగుల శ్రీనివాస్, బీసు చందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచులు తోటకూరి బీరయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, ఆరె మల్లేశ్, బీఆర్ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య, కవిడే మహేందర్, ఎగ్గిడి కృష్ణ, పన్నాల అంజిరెడ్డి, భాషబోయిన ఉప్పలయ్య, బీస కృష్ణంరాజు, కందుల శంకర్, పల్లె సంతోష్, రేపాక స్వామి, ముక్యర్ల సతీశ్, కోన్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
నెయ్యి సరఫరా రద్దు చేస్తే మూతే..
యాదగిరిగుట్టకు సరఫరా చేసే నెయ్యిని రద్దు చేస్తే నార్ముల్ సంస్థ దాదాపుగా మూత పడినట్టేనని నార్ముల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకరెడ్డి స్పష్టం చేశారు. ఒక్క దేవస్థానానికే నెలకు రూ. 1.85 కోట్ల నెయ్యిని సంస్థ నుంచి సరఫరా చేస్తామన్నారు. నెయ్యి కిలోకు రూ. 625 కు విక్రయిస్తామన్నారు. తద్వారా సంస్థకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. తమ హయాంలో 250 ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారికి భరోసా కల్పించామన్నారు. కానీ గత రెండేళ్ల కాలంలో వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి సంస్థ చేరుకుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ మరో డ్రామాకు తెరతీసే అవకాశం ఉందని పాల సంఘం చైర్మన్లు జాగ్రతగా ఉండాలన్నారు.