సూర్యాపేట, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి, విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఎస్ ఫౌండేషన్ చైర్మన్, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు.
ఆమె మాట్లాడుతూ గత పదేళ్లుగా అధికారికంగా బతుకమ్మ పండుగను నిర్వహించి మహిళలకు ఎంతో గౌరవాన్ని కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ఆడపడుచులు తొమ్మిదిరోజుల పాటు ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలన్నారు.
మహిళలు ఇష్టంగా పూజించే గౌరమ్మ అందరికీ ఆరోగ్యాన్ని ఐష్టెశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, మాజీ కౌన్సిలర్లు నిమ్మల స్రవంతి, ఆకుల కవిత, మొరిశెట్టి సుధారాణి, ఎస్కే సల్మామస్తాన్, కరుణశ్రీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కేసి పువ్వేసి సందమామ..
పువ్వు పువ్వు సేకరించి బతుకమ్మను పేర్చి గంధం, పసుపులద్ది.. గౌరమ్మను పూజించి ఆదివారం ఆడపడుచులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ‘ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయే సందమామా’ అంటూ ఆడి పాడారు. తొమ్మిదిరోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలను తొలిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో నిర్వహించారు. సూర్యాపేట పూలజాతరను తలపించింది. పేటలోని సద్దులచెరువు (మినీ ట్యాంక్‌బండ్) వద్ద జరిగిన ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బతుకమ్మలు ఇంటి నుంచి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున వర్షం రావడంతో మహిళలు నిరాశ చెందారు.
వర్షం తగ్గిన అనంతరం రెట్టింపు ఉత్సాహంతో చల్లటి వాతావరణంలో ఆడి పాడి సందడి చేశారు. ఎస్ ఫౌండేషన్ చైర్పర్సన్ గుంటకండ్ల సునీత జగదీశ్‌రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మను పేర్చారు.
స్వయంగా బతుకమ్మను తీసుకొని సాయంత్రం సద్దుల చెరువు వద్దకు వచ్చి గౌరీపూజ చేసి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళలు బతుకమ్మలను చెరువులో వదిలి ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు వివిధ వార్డుల్లోని బతుకమ్మ ఘాట్ల వద్ద మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని 44 ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ ఆడారు. 33 నిమజ్జన ప్రదేశాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్యతో పాటు పట్టణ ఎస్ఐలు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
Nalgonda2
కేసీఆర్ వల్లే బతుకమ్మకు ప్రపంచ వ్యప్త గుర్తింపు
రామగిరి, సెప్టెంబర్ 21 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసంలో ఆయన సతీమణి కంచర్ల రమాదేవి ఆధ్వర్యంలో వైభంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా నాయకులు, మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. పూజలు చేసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కంచర్ల రమాదేవి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు అత్యంత ప్రాముఖ్యత కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ సేవలతో బతుకమ్మ విశ్వవ్యాప్తమైందని కీర్తించారు. ఐసీడీఎస్ మాజీ ఆర్సీవో మాలే శరణ్యరెడ్డి, నాయకురాలు సింగం లక్ష్మి, యాట జయప్రదరెడ్డి, కేతిరెడ్డి కవిత, శ్రీపాత జ్యోతి, రావుల రేణుక శ్రీనివాస్‌రెడ్డి, కంచర్ల విజయరెడ్డి, కంచర్ల వినోద, ఝూన్సీ, గాదె లక్ష్మి, సరస్వతి అపత్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, మెరుగు గోపి, గున్రెడ్డి యుగందర్‌రెడ్డి, తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప పాల్గొన్నారు.
వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ
రామగిరి, సెప్టెంబర్ 21 : పూల పరవశం ఉప్పొంగింది.. తెలంగాణ ఆడపడుచుల ఆరాధ్య పండుగ బతుకమ్మ పండుగ. ఆదివారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’ జిల్లా వ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం దాకా వాడవాడల్లో అంబరాన్నంటేలా సాగింది. జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సబ్బండ వర్గాలవారు పూలతో బతుకమ్మలతో ఉత్సాహంగా తరలివచ్చారు.
రామగిరిలో రెండో భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, తులసీనగర్ భక్తాంజనేయస్వామి ఆలయం, వివేకానందనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, దేవరకొండ రోడ్డు సిదార్థకాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పాతబస్తీ సంతోషిమాత ఆలయం, కనకదుర్గాకాలనీ హనుమాన్‌దేవాలయం, బీటీఎస్, కలెక్టరేట్ సమీపంలోని దేవాలయాలు, లక్ష్మీనగర్, చర్లపల్లి, మర్రిగూడ, ఆర్జాలబావి, పానగల్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయం, పద్మానగర్ పార్కు, శివాజీనగర్పార్కు, మునుగోడు రోడ్డు హౌజింగ్‌బోర్డు, ఎన్జీ కాలనీల్లో బతుకమ్మ సంబురాలు వైభవంగా సాగాయి.