Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాక్వెలిన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ని రద్దు చేయాలన్న జాక్వెలిన్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు జూలై 3న ఇచ్చిన ఉత్తర్వు అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ పోలీసులు సుకేశ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేయడంతో వివాదం మొదలైంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ భార్యలను రూ.200కోట్లకుపైగా మోసం చేసినట్లు సుకేశ్‌పై ఆరోపణలున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించి.. ఈసీఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు సమయంలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ పేరు సైతం వెలుగులోకి వచ్చింది. జాక్వెలిన్‌కు సుకేశ్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లుగా ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో నటిని ఈ కేసులో నిందితురాలిగా చేర్చింది.
జాక్వెలిన్ చాలాసార్లు ఈడీ విచారణకు హాజరైంది. అయితే, ఈడీ దాఖలు చేసిన ఈసీఐఆర్ చట్టబద్ధంగా నిలకడగా లేదని.. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని జాక్వెలిన్ తన పిటిషన్లో పేర్కొంది. తనపై ఉన్న కేసు బలహీనంగానే ఉందని.. దాన్ని కొట్టివేయాలని కోర్టును కోరింది. ఢిల్లీ హైకోర్టు జులైలో జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించగా.. సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టులో సైతం ఎదురుదెబ్బ తగిలింది. కేసు నుంచి ఉపశమనం లభించకపోవడంతో జాక్వెలిన్‌కు ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విచారణను ఎదుర్కోవాల్సి రానుంది. ఈడీ సేకరించిన ఆధారాల ఆధారంగా నటిపై చచర్యలు తీసుకోనున్నారు. అయితే, జాక్వెలిన్‌కు ఇంకా అప్పీల్, బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.