హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్‌ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవారం హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 ముందు ఈటల ఎవరో తెలియదు..కానీ కేసీఆర్.. ఈటలను ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా , మంత్రిగా చేశారు. అలాంటి కేసీఆర్ పైన, హరీశ్ రావు పైన అరేయ్, ఒరేయ్ అంటూ.. విపరీత వ్యాఖ్యలు చేస్తున్నావు ఇదేనా ఈటల.. నీ సంస్కారం..? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈటలను ముఖ్యమంత్రి కావాలి అని రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్ అన్నపుడు ఈటల ఎందుకు ఖండించలేదు? అంటే ఈటలకు ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక మదిలో ఉందనే కదా అని అన్నారు.
టీఆర్ఎస్ డబ్బులు పంచుతోందని ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవం. ఒక్క ఎకరం అమ్మితే ఒక్క ఎలక్షన్ కొట్లాడతా.. అలాంటిది 200 ఎకరాలు ఉందని అని రాజేందర్ స్వయంగా అన్నారు. మా ఆస్తులన్నీ అమ్మైనా సరే ఓటర్లకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తాం అని ఈటల సతీమణి జమునా రెడ్డి అన్న విషయం వాస్తవం కాదా? అని కౌశిక్ రెడ్డి నిలదీశారు. నేను దొడ్డుబియ్యం తిన్నా.. నాకు డబ్బులు లేనప్పుడు ఆర్ కృష్ణయ్య నన్ను హాస్టల్ లో చదివించారు అని చెప్పిన ఈటల వేల కోట్లు ఎలా సంపాదించారు? చెప్పాలన్నారు.
ఈటల కుమారుడు ఈటల నితిన్ రెడ్డి బినామీ కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తి చెక్ డ్యాములను నాణ్యత లేకుండా నిర్మించారని మొన్నటి వర్షాలకు చాల చెక్ డ్యాములు కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. అందులో నా పొలం కూడా ఉంది. కోర్కల్, రామకృష్ణాపూర్, వీణవంక, అంబాలా, లక్ష్మక్కపల్లి, పోతిరెడ్డిపల్లి, మర్రిపల్లిగూడెం, బత్తినివానిపల్లి శంభునిపల్లి , శనిగరం చెక్ డ్యాంలు నాణ్యత లేక కూలిపోయాయి. రైతుల భూములు కొట్టుకుపోయాయి. దీనికి ఈటల సమాధానం చెప్పాలి అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
దళితులను మభ్యపెట్టాలని ఈటల చూస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల దళితులకు చేసింది ఏమి లేదు. పదవిలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడలేదు.. మరో అంబేద్కర్ లా కేసీఆర్ ప్రతి దళిత కుటుంబం అకౌంట్ లో రూ. 10 లక్షలు వేశారు. ఈటల దళితబంధు పై దళితులను అవమానించే రీతిలో మాట్లాడారు.. కేసీఆర్ దళిత బంధు డబ్బులు ఇస్తుంటే ఈటలకు బాధ ఎందుకు? అని ఆయన అన్నారు.
హరీశ్ రావును విమర్శించే అర్హత ఈటలకు లేదు.. ఈటల చేయని అభివృద్ధి పనులు హరీష్ రావు చేస్తున్నారు.. ప్రజలు అడిగిన వెంటనే హరీష్ రావు స్పందిస్తున్నారు…ఇది తప్పా? ఈటల ఆరోగ్య మంత్రిగా ఉండి కూడా కమలాపూర్ హాస్పిటల్లో సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. కానీ హరీశ్‌రావు అడిగిన వెంటనే కమలాపూర్ , వీణవంకలో 24 గంటల డాక్టర్, పోస్ట్ మార్టం ఏర్పాటు చేయించారన్నారు.నా ఊర్లో నా సొంత జాగాలో డబ్బులతో బస్టాండ్ కట్టించాను.. ఈటల ఎక్కడైనా సొంతగా బస్టాండ్ కట్టించారా? అని ఆయన ప్రశ్నించారు.
హుజురాబాద్ ప్రజలు అవినీతి, కబ్జాకోరు ఈటలను ఎప్పుడు ఓడిద్దామా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని.. వెంటనే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు.