‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ ఈ నినాదం ఇక గతం కానున్నది. ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్యానికి చేరుతామనే గ్యారెంటీ ఇప్పుడు లేదు. ఎందుకంటే, పెరిగిన బస్సు చార్జీలను చూస్తే బస్సులోనే గుండెపోటు వస్తుందేమోనన్న భయం ప్రయాణికులకు కలుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కూడా పూర్తికాకుండానే రెండుసార్లు బస్సు చార్జీలను పెంచి సామాన్యులపై భారాన్ని మోపింది. ఓ దిక్కు ప్రజా పాలనొచ్చె అని చెప్పుకొంటూనే, మరో దిక్కు రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా దివాలా తీయిస్తున్నరు.
జూన్‌లో బస్ పాస్‌ల ధరలను 20 శాతం పెంచిన కాంగ్రెస్ సర్కారు విద్యార్థులు, రోజువారీ చిరుద్యోగులను బస్సు ఎక్కకుండా చేసింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి బస్ చార్జీలను పెంచింది. దీంతో గ్రేటర్ ప్రజలు బస్సు ఎక్కాలంటేనే బుగులు పడుతున్నారు. సిటీ బస్సుల్లో మొదటి మూడు స్టాపుల వరకు రూ.5 పెంచి, ఆ తర్వాత నాలుగో స్టాప్ నుంచి ఏకంగా రూ.10 దండుకుంటుండటం దారుణం. ఆర్డినరీ బస్సుల్లోనే ఇలా ఉంటే, మెట్రో, డీలక్స్, ఏసీ బస్సు చార్జీల బాధలు చెప్పనలవి కావు.
గతంలో బస్సు చార్జీల పెంపు అంటే 50 పైసలో, 70 పైసలో, రూపాయో ఉండేది. కానీ, కాంగ్రెస్ మాత్రం సామాన్యుల కష్టార్జితాన్ని భారీగా దోచుకుని, ఖజానాలో దాచుకునే పాలసీని ఎంచుకున్నది. నిత్యం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు రోజుకు 26 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వాళ్లందరూ కష్టజీవులేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కష్టజీవుల పొట్ట కొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకున్నది. మహాలక్ష్మి పథకం పేరిట ఒకవైపు మహిళలకు ఉచితమనే ఎరవేసి, మరోవైపు కుటుంబంలోని పురుషులు, విద్యార్థుల నుంచి చక్రవడ్డీతో సహా వసూలు చేస్తుండటం హేయం.
పైగా ఉచిత బస్సుల పుణ్యమాని సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సు సర్వీసులు గాయబ్ అయ్యాయి. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల సామాన్యుల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. నెలంతా కష్టపడితే చేతికొచ్చే జీతంలో చాలావరకు బస్సు చార్జీలకే పోతున్నాయని, మిగతా సగంతో కుటుంబాలను నెట్టుకొచ్చేదెలాగని అల్పాదాయ వర్గాలు, సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. గతంలో ఏదైనా కష్టమొస్తే సామాన్యులంతా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసేటోళ్లు. ప్రభుత్వాలు కూడా వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించేవి. కానీ, కాంగ్రెస్ పాలకులు మాత్రం ప్రజలు రోడ్డెక్కకముందే గృహనిర్బంధం చేస్తున్నారు. ప్రశ్నించకముందే గొంతులను నొక్కుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ను వద్దనుకొని కాంగ్రెస్‌కు ఓటేస్తే, సామాన్యుల బతుకులు నేడు బస్సుల కింద నలిగిపోతున్నాయి.
– రాజు పిల్లనగోయిన