బీహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటూ దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఢిల్లీలో నినదిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ గల్లీల్లో అదే ప్రజాస్వామ్యాన్ని బొందపెడుతున్నది. బీహార్‌లో ఓటు పవిత్రమని చెప్తున్న రాహుల్‌గాంధీకి.. తెలంగాణ ఓటు కూడా అంతే పవిత్రమని తెలియకపోవడం విడ్డూరం. తెలంగాణలో సొంత పార్టీ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అదే తప్పు, అదే చీకటి రాజకీయ పన్నాగం ఆయన కంటికి కనిపించకపోవడం విస్మయం కలిగిస్తున్నది. బీహార్‌లో ఓట్ల చోరీపై గగ్గోలు పెడుతున్న ఆయన తెలంగాణలో జరుగుతున్న ఫేక్ ఓట్లపై మాత్రం నోరు మెదపడం లేదు. ఓటు చోరీ అనే నేరం ఎక్కడ జరిగినా ఒక్కటేనన్న విషయాన్ని ఆయన గ్రహించాలి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సాధారణ ఎన్నిక కాదు. మంచికి-చెడుకు, వికాసానికి-విధ్వంసానికి, అభివృద్ధికి-అరాచకానికి మధ్య జరుగుతున్న పోరాటమిది. అంతేకాదు, ప్రజాస్వామ్య పునాదుల మీద నడిచే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతకు పరీక్ష ఇది. అలాం టి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన పనులు ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఓటర్ కార్డులను స్వయంగా పంపిణీ చేయడం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకోవడం కూడా. బోగస్ ఓటర్కార్డులను పంచిపెట్టి, తద్వారా నిజమైన అర్హుల ఓటుహక్కును కాలరాయాలని చూశారు. ఓటరు కార్డులను పంపిణీ చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత. కానీ, ఆ బాధ్యతలను తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళితోపాటు ప్రజాస్వామ్య విలువలను తునాతునకలు చేశారు. ఈ ఓట్ల చోరీ ఉదంతం బయటపడ్డాక నవీన్ యాదవ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసిన అధికారులు ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.
2023లో అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.75 లక్షల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3.98 లక్షలకు చేరింది. అంటే దాదాపు 23 వేల ఓట్లు పెరిగాయన్న మాట. అంతేకాదు, 12 వేల ఫేక్ ఓట్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ చెప్తున్నది. ఈ లెక్కన మొత్తం వ్యత్యాసం 35 వేల ఓట్లు. రెండేండ్లలోనే ఈ స్థాయిలో ఓట్లు పెరగడం సాధారణ విషయం కాదు. ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి నేతృత్వంలో నమోదయ్యాయి? ఈ తతంగమంతా నడిపించిందెవరు?
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అవకతవకలను బీఆర్ఎస్ వెలికితీసి ప్రజల ముందు పెట్టడం ప్రశంసనీయం. కాంగ్రెస్ ఓట్లచోరీని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ, క్యాడర్ ఎంతగానో కృషి చేసింది. నియోజకవర్గంలోని ప్రతీ పోలింగ్ బూత్, ప్రతీ ఇంటిని బీఆర్ఎస్ కార్యకర్తలు జల్లెడ పట్టారు. ప్రతి అనుమానాస్పద ఓటును గుర్తించి కాంగ్రెస్ మోసాన్ని రుజువులతో బట్టబయలు చేశారు. సంస్కృతి అవెన్యూ అనే కొత్తగా నిర్మించిన ఓ అపార్ట్మెంట్లో 43 ఫేక్ ఓట్లు నమోదైనట్టు బీఆర్ఎస్ పరిశీలనలో తేలింది. ఓటర్ జాబితాలో ఉన్నవారిలో ఎవరూ అక్కడ నివసించడం లేదని అపార్ట్మెంట్ వాసులు స్పష్టం చేశారు. బూత్ నంబర్ 125లో 23 ఫేక్ ఓట్లు, 80 గజాల చిన్న ఇంట్లో 23 మంది ఓటర్లు.. ఇవన్నీ ఒకేచోట రూపుదిద్దుకున్న స్క్రిప్ట్‌లోని ఆణిముత్యాలే. ఇంటి నంబర్ 118లోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 32 ఓట్లున్నాయి. సెప్టెంబర్ 2న వేలల్లో ఓట్లు నమోదయ్యాయని బీఆర్ఎస్ వాదిస్తున్నది. జూబ్లీహిల్స్‌లో తనకు ఓటు ఉందని తెలిసి నిర్ఘాంతపోయిన సిరిసిల్లకు చెందిన గోసూరి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు స్వయంగా నిరసన తెలపడం గమనార్హం.
కార్తీక్ అనే యువకుడి పేరుతో మూడు ఓట్లున్నాయి. మాధురి గుడ్డేటి అనే యువతికి వేర్వేరు ఫొటోలతో రెండు ఓట్లున్నాయి. 8-3-229/డీ/43/1 అనే ఇంటి నంబర్ మీద 42 ఓట్లు నమోదయ్యాయి. కానీ, ఆ చిరునామాలో అసలు ఇల్లే లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సోదరుడికి వేర్వేరు చోట్ల మూడు ఓట్లున్నాయి. ఇది ఓట్ల చోరీ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి ఉరివేయడం. ప్రజాస్వామ్యం బలంగా నిలబడేది ఓటు పవిత్రత మీదే. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా జరగకపోతే, వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఓటుహక్కు అంగట్లో సరుకైపోతే, ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. ఎన్నికల సంఘం పర్యవేక్షక పాత్రకే పరిమితం కాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజాస్వామ్యాన్ని రక్షించే, న్యాయం, ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా ముందుకురావాలి. ఒక పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల వ్యవస్థను తన చెప్పుచేతల్లోకి తీసుకుంటే ప్రజాస్వామ్యం నిర్జీవమవుతుంది. పారదర్శకత అనే భావన మసకబారుతుంది. ప్రజాస్వామ్యంలో ఒకే చట్టం-ఒకే న్యాయం ఉండాలి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవడం ఎన్నికల కమిషన్ కర్తవ్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తక్షణావసరం కూడా.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రజాస్వామ్యానికి అద్దం లాంటిది. గెలుపోటములను నిర్ణయించే పోటీ కాదు ఇది, ప్రజాస్వామ్య విలువల కోసం జరుగుతున్న సంగ్రామం. ఓటు అంటే కేవలం గుర్తింపు కాదు, అది ప్రజా చైతన్యానికి ప్రతీక. దాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు విలువను తెలుసుకొని నిష్పాక్షికంగా వినియోగిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్లపై ఉన్నది.
– (వ్యాసకర్త:ఓయూ పరిశోధక విద్యార్థి)
రాజేష్ నాయక్.జి 96035 79115