రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్వరూపం బయటపడటంతో ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన పాలన అని ప్రజలకు అర్థమైంది. ఈ సుమారు రెండేండ్ల పాలనలో పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టడం, గతంలో ఎంపికైన అభ్యర్థులకే నియామక పత్రాలు ఇవ్వడం తప్పితే ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టిందీ లేదు. అనవసర హడావుడి తప్ప పాలనలో పస లేదు. పర్యవసానంగా రెండేండ్లకే కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విముఖత, విరక్తి కలుగుతున్నది.
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతోనే కాలం గడుపుతున్నది. విద్య, వైద్యం, వ్యవసాయరంగాలను నమ్ముకున్న రైతులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఇలా అన్ని వర్గాలు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయాయి. పరిష్కారం కాని సమస్యలు సచివాలయంలో విడుదల కానీ బిల్లుల్లా గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇక కాళేశ్వరం విషయానికి వస్తే… పగుళ్లు ఏర్పడిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అంటే, కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు ప్రాణధార అని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. ఇక బనకచర్ల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక రైతులకు యూరియా సరఫరా విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. సరిపడా యూరియా దిగుమతి చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక లేని ప్రభుత్వం చేతులెత్తేసింది. పైగా యూరియాను బ్లాక్ చేస్తున్నారని రైతులనే నిందించారు. అయితే యూరియా కోసం లైన్లలో నిలబడి కొందరు రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.
రాష్ట్రం ప్రభుత్వం సర్కార్ బడులను బలోపేతం చేయకపోవడంతో వాటిలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. 78 శాతం పాఠశాలల్లో 100 కంటే తక్కువగా అడ్మిషన్లు జరగడం బాధాకరం. ఇక గురుకులాల పరిస్థితి మరీ దారుణం. అడ్మిషన్లు తగ్గాయని కొన్ని సంస్థల్లో ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ చేసింది. విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు వాటి యజమానులు తాళం వేస్తున్నారంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. కాగా, రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అంటూ ప్రభుత్వం కొత్తగా హడావుడి చేస్తున్నది. అవి ఏ మేర విజయం సాధిస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే పేద ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్న ఇండ్లను కూలగొడుతూ హైడ్రా పేరుతో మూసీ ఒడ్డునే గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించుకున్న అస్మదీయులకు మాత్రం నోటీసులు జారీచేసి చేతులు దులుపుకోవడం పక్షపాత వైఖరిని సూచిస్తున్నది. హైడ్రా పేరున గొప్ప దందా జరుగుతున్నట్టు వింటున్నాం. అంటే పేదలను నిరాశ్రయులను చేస్తూనే పెద్దలను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
భూ సేకరణ విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్ విస్తరణ పేరుతో పెద్దల భూములను కాపాడుతూ పేదల భూములకు ఎసరు పెడుతున్నదీ ప్రభుత్వం. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేలా ట్రిపుల్ ఆర్ రీ అలైన్మెంట్ జరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విమర్శిస్తుండటం గమనార్హం. ఇక ఉద్యోగులను, పెన్షనర్లను ఎన్నికలకు ముందు ఎన్నో విధాలుగా మభ్యపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దెనెక్కిన 6 నెలల్లోనే పీఆర్సీ, డీఏ బకాయిలు విడుదల చేస్తామంటూ ప్రలోభపెట్టి ఈ రెండేండ్ల కాలంలో కేవలం రెండు డీఏలు మాత్రమే ఇచ్చింది. పైగా ఇదే గగనమైందంటూ కొత్త పాట పాడుతున్నది. ఇక రిటైర్ అయిన వారికి పెన్షనరీ బెనిఫిట్స్ లేవు. కోర్టుల నుంచి చెల్లింపు ఉత్తర్వులు తెచ్చుకున్నా అవి ఆర్థిక శాఖలో చెల్లడం లేదు. కమీషన్ల దందా చాలా బాగా నడుస్తున్నది. 2023లో రిటైర్ అయిన వారి బిల్లులు పెండింగ్‌లో ఉండగా 20 24లో రిటైర్ అయిన వారి వద్ద లంచాలు తీసుకొని బకాయిలు విడుదల చేసినట్టు సంఘాల ప్రతినిధులే ఆరోపిస్తున్నారు. కొంతమంది పెన్షనర్లు చేతికొస్తుందనుకున్న సొమ్ము రాక భంగపడి బలవన్మరణాలకు పాల్పడటం శోచనీయం.
ఇక రాష్ట్ర మంత్రుల విషయానికి వస్తే వారి ది రోజుకో లొల్లి. వారి మధ్య సయోధ్య ఒక మిథ్య. ముఖ్యమంత్రికి తెలువకుండా, తెలుపకుండా కొందరు మంత్రులు ఢిల్లీ అధిష్ఠా నంతో మంతనాలు జరుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలు జరుపుతారు. మంత్రుల మధ్య కమీషన్ల విషయం రచ్చకెక్కింది. కులాల కుంపట్లు రోజురోజుకు రాజుకుంటున్నాయి.
ఒకరిపై ఒకరు బాహాటంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తెలంగాణ సమాజానికి అసహ్యంగా ఉన్నది. ఒకరి శాఖలో మరొకరు వేలు పెడుతున్నారని బాహాటంగానే మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కానీ, పీసీసీ అధ్యక్షుడు కానీ ఈ తగాదాలను తీర్చలేక తమ పార్టీలో ప్రజాస్వా మ్యం పాలు కాస్త ఎక్కువ అంటూ ‘కింద పడ్డా మొహం పైకే’ అన్న చందాన వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 2.3 లక్షల కోట్లు అప్పు చేసింది. గత మూడు, నాలుగు నెలలుగా ప్రతి ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నదని ఆర్థికవేత్తలు అంటున్నారు. వరుసగా గత మూడు నెలలుగా జాతీయ సగటు ఆర్థిక పరిస్థితి 1.54 ఉండగా రాష్ట్రస్థాయి మైనస్‌లో ఉండటం ప్రమాదకర స్థితిని సూచిస్తున్నది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రతి రంగంలోనూ ప్రభుత్వ అసమర్థత లేదా క్రియాశూన్యత స్పష్టమవుతున్నది. దిద్దుబాటు చర్యలు లేవు. చేసిన వాగ్దానాలు, కొత్త పథకాలు పక్కన పెట్టి అమలులో ఉన్న పథకాలు అటకెక్కించక కొనసాగిస్తే అదే గొప్ప అన్న పరిస్థితి దాపురించింది.
ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నది. మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు తెలంగాణ సమాజాన్ని ముంచెత్తుతున్నాయి. విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. సమాజంలో నేరపూరిత వాతావరణం రోజురోజుకు పెరుగుతున్నది. ప్రభుత్వ అచేతనత్వం దానికి మరింత దోహదపడుతున్నది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభు త్వం ఉన్నదా? ఉంటే, అది పనిచేస్తున్నదా అనే సందేహం ప్రజలకు కలుగుతున్నది.
– శ్రీశ్రీ కుమార్ 94403 54092