జగిత్యాల టౌన్, అక్టోబర్ 17: కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విప్, మంత్రిగా తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ధర్మపురిలో ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఎంతో అభివృద్ధి చేశానని అడ్లూరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అబద్ధాలు మాట్లాడడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అడ్లూరి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ సంక్షేమ శాఖ గాడితప్పిందని, నిర్వహణ సరిగ్గాలేని కారణంగా ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు, బకాయిలు చెల్లించకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పిల్లలు రోడ్లపైకి వస్తున్న సంఘటనలు కనబడతలేవా..? అని ప్రశ్నించారు.
రెండేండ్లుగా రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు వారిని బయటకు పంపిస్తున్నాయని, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు 220 కోట్లు, 600 ప్రైవేటు గురుకుల భవనాలకు 215 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇంకెప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని, ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై అవగాహన లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
అనంతరం ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్లు ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, రామన్న మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురిలో ఎంతో అభివృద్ధి చేశామని, ఏనాడూ ఆలయం నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టలేదన్నారు. కానీ, ఇటీవల చాగంటి కోటేశ్వర్రావు ప్రవచన కార్యక్రమానికి ఆలయ ఫండ్ నుంచి సుమారు 20 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిసిందని ఆగ్రహించారు. సొంత ప్రయోజనాల కోసం దేవుని సొమ్ము ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఖర్చులపై ఈవోను అడిగితే ఇప్పటివరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని ఆక్షేపించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, జడీప మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ పాల్గొన్నారు.