న్యూఢిల్లీ, అక్టోబర్ 17: అమెరికా డైవర్సిటీ వీసా(డీవీ) లాటరీ నుంచి భారతీయులను 2028 వరకు అమెరికా మినహాయించింది. ఈ డీవీ లాటరీని గ్రీన్ కార్డు లాటరీగా కూడా వ్యవహరిస్తారు. గడచిన ఐదు సంవత్సరాలకు పైగా అమెరికాకు తక్కువ సంఖ్యలో ప్రజలు వలస వచ్చిన దేశాల నుంచి అందిన దరఖాస్తులలో 50,000 మంది వరకు ఈ ప్రోగ్రామ్ కింద ఇమిగ్రెంట్ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది. అయితే భారత్ ఈ పరిమితిని దాటేసింది. భారతీయులకు మంజూరైన ఇమిగ్రెంట్ వీసాల సంఖ్య గడచిన ఐదేళ్లుగా పరిమితికి మించి ఉండడంతో 2028 వరకు భారతీయులకు ఈ లాటరీ ద్వారా వీసాలు పొందే అర్హతను కోల్పోయారు.
గడచిన ఐదేళ్లలో 50,000కు మించి ఇమిగ్రెంట్లను అమెరికాకు పంపిన కారణంగా డీవీ లాటరీ నుంచి భారత్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలసలు పోగా 2022లో ఈ సంఖ్య 1,27,010కి పెరిగింది. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస పోయారు. భారత్‌తోపాటు చైనా, దక్షిణ కొరి యా, కెనడా, పాకిస్థాన్‌ను కూడా డీవీ లాటరీ నుంచి తప్పించే అవకాశం కనపడుతోంది.
భారతీయులకు డీవీ లాటరీ తలుపులు మూసుకుపోవడంతో అమెరికాలో శాశ్వత నివాసాన్ని(గ్రీన్ కార్డు) పొందడానికి చట్టపరంగా ఉన్న అన్ని మార్గాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. గ్రీన్ కార్డు పొందేందుకు ఇక మిగిలిన ప్రత్యామ్నాయాలలో హెచ్-1బీ వర్క్ వీసాను గ్రీన్ కార్డుగా మార్చడం, పెట్టుబడి ఆధారిత ఇమిగ్రేషన్, ఆశ్రయం(అసైలమ్) లేదా ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీటి నిబంధనలను కఠినతరం చేయడంతో ఈ మార్గాలు చాలా పరిమితమైపోయాయి.
ట్రంప్ ప్రభుత్వం స్టూడెంట్ వీసా విధానాలను కట్టుదిట్టం చేయడంతోపాటు అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా శోధించడం వంటి చర్యలు చేపట్టింది. జాతీయ భద్రత ముప్పును పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుదారుల వివరాలను లోతుగా పరిశీలించాలని దౌత్యాధికారులను అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. అమెరికా గుర్తించిన విదేశీ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, మద్దతును కూడగట్టేందుకు అభ్యర్థులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతోపాటు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడిన అభ్యర్థులను దేశంలోకి అనుమతించవద్దని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. అంతేగాక హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(రూ. 88లక్షలు) పెంచడంతో విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు అమెరికా కలలు తీరడం ఇక కష్టంగా పరిణమిస్తోంది.