రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. వివాహ వేడుకలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ.. కార్యకర్తలను, ప్రజలను అప్యాయంగా పలుకరిస్తూ ముందు కు సాగారు. మధ్యాహ్నం 2గంటలకు గంభీరావుపేట మండల కేంద్రానికి వచ్చిన ఆయన, గాయత్రి ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరువారి శంకర్ కూతురు రమ్య, నవీన్‌కుమార్ వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అక్కడి నుంచి సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. భవన్‌లోని కల్యాణమండపంలో ఆవునూరి వెంకట్రాములు కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను దీవించారు. గీతానగర్‌లో బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్ ఏర్పాటు చేసిన ఆడియో రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌కుమార్, నాయకులు బొల్లి రాంమోహన్, పాపాగారి వెంకటస్వామిగౌడ్, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.