‘బండ్ల మంత్రి ఎవ్వలతోనో మాట్లాడుతున్నట్టున్నడు సర్, అప్పట్నుంచీ ఫోన్ కుయ్కుయ్మని ఎంగేజ్ అస్తనే ఉన్నది’, ‘అయితే అర్జెంటుగా మంత్రి బండ్లూరికి ఫోన్ గల్పు’, ‘ఈ మంత్రి ఫోన్ గూడ కుయ్కుయ్మనే ఎంగేజస్తున్నది సర్’, ‘ఈళ్లు ఎవ్వలతోని మాట్లాడుతున్నరువయా? ముక్కమంత్రి అంటే బొత్తిల్కే భయం లేకుండవోయింది. సీఎం పేషీ నుంచి ఫోన్ వోయినా పట్టించుకుంటలేరంటే ఈళ్లు బగ్గ ముదిరిపోయిన్రు. తోకలు కట్జెయాల్సిందే ఇగ’, ‘అటు ఆ మంత్రిది, ఇటు ఈ మంత్రిది, ఇద్దరి ఫోన్లు బిజీ బిజీ అస్తున్నయంటే, ఆళ్లిద్దరే మాట్లాడుకుంటున్నరేమో సర్’. ‘నువద్దేనయా సెగెట్రీ. అయినా, నిన్ననే గదనయ్యా ఈళ్లిద్దరూ ఒగరిమీదొగరు మనకు శాడీల్జెప్పింది.
ఇంతల్నే ఇద్దరొక్కటైన్రంటవా?’, ‘మీరే గదా సర్ మంత్రులెవ్వరూ మందిల తిట్టుకోవద్దని శెప్పింది. బుద్ధికొచ్చిన్రేమో! అందుకే, మందిల తిట్టుకోకుండా ఫోన్లనే తిట్టుకుంటున్నట్టున్నరు’, ‘అవునా.. వెరీ గుడ్. ఇదే కదనయ్యా అభివృద్ధి అంటే. మంత్రులు నా మాటినడం లేదని మొన్నెవ్వలో పేపర్ల రాసిన్రు. ఆళ్లకు నిజంగా బుద్ధి లేదయ్యా సెగెట్రీ. ఆళ్లను బట్టలిప్పి గొట్టాలె, ఈలైతే ఆళ్ల పేగుల్దీసి మెడలేస్కోవాలె. అగ్గొ బెల్ మోగుతున్నది ఎవ్వలో అచ్చినట్టున్నరు జర సూడు..’
‘సార్.. భూముల మంత్రొచ్చిండు. లోపల్కి రానియ్యిమంటరా?’, ‘ఎయ్ సెగెట్రీ నేనొస్తే సక్కగ లోపల్కి దోలియ్యాలె గని, నన్ను దర్వాజల నిలవెట్టి పంపియ్యాల్నా అని అడుగుతవా ఆయ్.. అస్సల్కే నా దగ్గెర 20 మంది ఎమ్మెల్యేలున్నరు. రేపు నేన్ ముక్కమంత్రైనంక నీ సంగతి శెప్తాగు..’, ‘ముక్కమంత్రి గారు ఏదో శెప్తున్నరు, జర్రాగండి సర్! ముక్కమంత్రి గారు మిమ్మల్ని లోపల్కి తోలియ్యిమన్నరు ఇప్పుడు రండి సార్’, ‘ఔ మల్లా, మరేమనుకుంటున్నవ్ మనమంటే..’
‘శెప్పండి మంత్రి గారు, ఏదో పనిమీదొచ్చిన్రు?’, ‘ఏం లేదు ముక్కమంత్రి గారు, మీరు నన్ను మంత్రిని జేసిన్రు గదా, ఒక్క మా జిల్లాకే మంత్రినా, లేక రాష్ర్టానికి గూడ మంత్రినా?’, ‘మంత్రి అంటే రాష్ర్టానికే ఉంటరు సామి, జిల్లాకు మంత్రి ఉండడు’, ‘అదివోంగ మీరు వరంగల్లు జిల్లాకు గూడ నన్ను ఇంచార్జి మంత్రిని జేసిర్రు’, ‘నువద్దే జేసిన, అయితేందిప్పుడు, కాదని ఎవ్వలంటున్న రు?’, ‘మరి, ఆ ఆదాయ మంత్రేమో నన్ను వరంగల్లుకు రావొద్దంటున్నది. అసలేమనుకుంటున్నదామె. ఆమెకు, అసలు నా గురించి తెల్సా, తెల్వదా? జేబులకెళ్లి గన్ను తీసిన్నాంటె గున్న గున్న ఉర్కాలె, మరేమనుకుంటున్నదో మల్ల!’, ‘ఆమె గంతే. ఒక్కసారి శెప్తే ఇనే రకం గాదు, తొందరపడి గన్ను తియ్య కు, నేను ఆమెకు ఫోన్జేసి సప్పుడ్దాక ఉండుమని మా శెప్తగని, నువ్వు మాత్రం రాష్ర్టానికి మంత్రివనే ఇషయం మర్శిపోకు. ఏ జిల్లాల ఏ పని గావాల్నో ఆ పన్జేస్కో. డోంట్ వర్రీ’, ‘సరే ముక్కమంత్రి గారు థాంక్యూ. మీరీ మాత్రం హింటిస్తే సాలు, శెలరేగిపోతా. మా ఇంట్ల నా పోట్వ లేకున్నా మంచిదే గనీ, నీ పోట్వ పెట్టుకుంట, ఉంటా ఇగ’
‘సెగెట్రీ ఈనెదో పంచాదీ. పెద్ద నసనయ్యా ఈ మన్షి. ఎంతకిడ్శివెట్టడు. అన్నట్టూ ఆయన ఎల్లిపోయిండో లేదో, సూడు, మనోడు పోయినట్టే పోయి దర్వాజ కాన్నే నిలవడి ఇంటడు. నేన్ వోయినంక నా గురించి ఏమన్న మాట్లాడుకుంటున్నరా అని ఇనే బాపతు మనోడు. ‘సార్, ఎల్లిపోయిండు దర్వాజ కాడ ఎవ్వల్లేరు..’
‘అబ్బా మళ్లెవలయ్యా ఈ ఫోన్. సెగెట్రీ ఈ ఫోనెత్తు, ఎత్తి ఔతలొల్లు ఎవ్వలైనా మంచిదే నేన్ లేనని శెప్పు’. ‘హల్లొ.. అవునా.. అయితే ఆగండాగండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి..’, ‘సార్ మీకే ఫోన్. ఎవ్వలో ఢిల్లీ నుంచి అట, గరం మీదున్నడు. గట్టిగ, గద్మాయించి మాట్లాడుతున్నడు. లేడని శెప్పుమంటరా?, ‘నీ తలపండు వల్గ సెగెట్రీ నువ్వు నా కొంప ముంచేట్టున్నవ్. జర ఆ ఫోన్ ఇటు వారెయి’, ‘సర్ సర్… ఓకే సర్. ట్రస్ట్ మి సర్. ఐ విల్ టాక్ విత్ కొండక్క, పొంగన్న సర్. యూ డోంట్ వర్రీ సర్, ఐ విల్ బ్రీఫ్ దెమ్ సార్’
‘సెగెట్రీ ఆ జండూబామ్ తీస్కురావయ్యా తల గిర్రుమని తిర్గుతున్నది’, ‘సార్.. మీ ఇంటోళ్లు, మంత్రులు, ఆఫీసర్లు, ఇంకా మనోళ్లెవ్వల్ ఫోన్జేసినా కాల్మీద కాలేస్కొని మాట్లాడే మీరు, ఢిల్లీ నుంచి ఫోనొచ్చిందంటే మాత్రం జప్పున లేసి, వంగి మరీ మాట్లాడుతరు, ఎందుకు? ఇది సిగ్గా, భయమా లేక గౌరవమా?’, ‘సిగ్గుతో కూడిన భయం వల్ల అచ్చిన గౌరవం అనుకుంటున్నవా సెగెట్రీ. కాద్, కాద్, అస్సల్కే గాదు. కూసుండీ కూసుండీ నడుము గుంజుకొస్తది గదా, అందుకే అప్పుడప్పుడు లేసి వంగితే పానం హాయిగుంటదని, ఇట్లా వంగి మాట్లాడుతా.
‘అన్నట్టూ… సెగెట్రీ ఈ మంత్రుల లొల్లేందివయా, లొల్లి పెట్టుకోవద్దంటే ఇంటలేరాయె? ఢిల్లీ నుంచి ఆళ్లేమో మాటిమాటికి ఫోన్జేసి మన మంత్రులేం జేస్తుర్రు?, మన మంత్రులేం జేస్తుర్రని అడుగవట్టె? ఈళ్లతోని నాకు పెద్ద పరేషానే అచ్చి పాడైంది గదా?. ఇంతకీ ఏందటనయ్యా ఈళ్ల బాధ?’, ‘మీకు తెల్వందేముంది సార్, పైసల బాధే..’, ‘అవునా?’, ‘అవును సార్.. ఈళ్లది పైస ల బాధే. మన పార్టీ అధికారంలకచ్చి రెండేండ్లయింది. ఇంకో మూడేండ్లయితే ఎట్లాగూ ఎలచ్చన్లస్తయి.., అవొచ్చేలోపే మస్తు సంపాయించుకోవాలని మంత్రులు సదురుకుంటర్రు సార్..’, ‘ఎందుకయ్యా, మళ్లా మనమే గదా అచ్చేది? తొందరెందుకు?’, ‘అని మీరొక్కలే అనుకుంటే సరిపోదు గదా సార్.. ప్రజలు గూడ అనుకోవాలె గదా? మనకెందుకు ఓటేశామా అని ప్రజలు ఇప్పటికే జండూబామ్ రాసుకుంటున్నరు. అయినా, అచ్చే ఎలచ్చన్ల మనం గెలువమని ఒక్క మీకు దప్ప అందరికీ అర్థమైంది. అందుకే మన మంత్రులందరూ ఇప్పట్నుంచే సదురుకుంటర్రు..’, ‘నేనెప్పుడో సదురుకున్నననే ఇషయం సెగెట్రీకింకా అర్థం గాన్నట్టుంది ఫాఫం ’, ‘సార్.. నోట్లె నోట్లె ఏదో గులుగుతున్నారు?’, ‘ఏం లేదయ్యా సెగెట్రీ, ఓసారి ఒలింపిక్స్-2036 ఫైల్ పట్టుకురా’…
– గడ్డం సతీష్ 9959059041