కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు సాయం చేయలేదని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన రైతు చిట్టె పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడి సాయం చేశారని, అప్పుడు ఫికరే ఉండేది కాదన్నాడు. నీళ్లు లేక పంటంతా ఎండిపోయిందని, అప్పు రూ.రెండు లక్షలు భూమిపాలైనట్టు చెప్పాడు. ఎండిన పంట మూగజీవాల పాలవుతుందని పేర్కొన్నాడు.
ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్కు చెందిన రైతు దర్శనాల రవికిరణ్ తన నాలుగెకరాల్లో రూ.40 వేల పెట్టుబడి పెట్టి జొన్న విత్తాడు. మత్తడి ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా నీరు అందుతుందనే నమ్మకంతో సాగు ప్రారంభించాడు. రోజురోజుకు నీటి సమస్య పెరిగి భూగర్భజలాలు అడుగంటాయి. ఫలితంగా పంట ఎండిపోవడంతో గురువారం మూగ జీవాలకు మేతగా వదిలేశాడు. మిగిలిన పంటలనైనా కాపాడుకోవడానికి కుడి కాల్వ ద్వారా నీరందిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని కొత్తపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి, చెనుగోనిపల్లి గ్రామాల రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. జూరాల కుడి కాల్వ కింద రైతులు వారబందీ ప్రకారం నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. దీంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
-గద్వాల