న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి.
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన సవరణల ఆమోదం కోసం కేంద్రం ఒత్తిడి చేస్తుండగా, నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడాన్ని ప్రతిపక్షం లేవనెత్తనుంది. 2026 జన గణన డాటా అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని విపక్ష పార్టీలు ఆప్, ఆర్జేడీ, డీఎంకేలు డిమాండ్ చేయవచ్చునని భావిస్తున్నారు.
అదే సమయంలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘కోటాలో కోటా’ డిమాండ్‌ను నెరవేర్చాలని సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ డిమాండ్ చేయవచ్చు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లు 2023లో పార్లమెంట్లో ఆమోదం పొందింది. అయితే చట్టం ప్రకారం 2027 జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు దానిని అమలు చేయరాదు. దీంతో దాని అమలు 2034కు వాయిదా పడింది.