పెరిగిన పెట్టుబడులు, నాసిరకం విత్తనాలు, పనిచేయని పురుగులమందులు, సమయానికి అందని ఎరువులు, దొరకని కూలీలు, అనుకోని ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోతున్న రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కుంగదీస్తున్నది. ఇన్ని ఇబ్బందుల మధ్య సైతం భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసి పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం లేదు. ప్రస్తుతకాలంలో కౌలు రైతులు అధిక విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా యాసంగిలో మొక్కజొన్న పంటను అత్యధికంగా సాగుచేశారు.
కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం పెట్టిన నిబంధనలు శాపంగా మారాయి. మద్దతు ధర రూ.2,400 ప్రకటించిన ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే నిబంధన పెట్టింది. కానీ సాధారణంగా ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అంతేకాదు, కొనుగోలు కేంద్రానికి భూ యజమాని వచ్చి ఆధార్‌కార్డు, పాస్బుకుతోపాటు బయోమెట్రిక్ (థంబ్) వేయాలని అధికారులు చెబుతున్నారు. యజమాని థంబ్ వేస్తే ఆ డబ్బులు నేరుగా అతడి ఖాతాకే జమ అవుతాయి. దీంతో కష్టపడి పంట పండించిన కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు.
-మధిర, ఏప్రిల్ 14
యాసంగిలో ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పండించిన కౌలు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు శాపంలా మారాయి. భూ యజమానులు వారి భూములను కౌలుకు ఇచ్చి కౌలు రొక్కం పొందుతున్నారు. అయితే, భూములను కౌలుకి ఇచ్చిన రైతులు కొందరు వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కౌలు రైతుల కోసం వారు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు రాలేని పరిస్థితి. అసలైన రైతులు వస్తేనే పంటను కొనుగోలు చేస్తామని అధికారులు కొర్రీలు పెడుతున్నారు.
1.75 లక్షల ఎకరాల్లో మొకజొన్న సాగు
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.75 లక్షల ఎకరాల్లో రైతులు మొకజొన్న సాగు చేస్తున్నారు. ఒక మధిర నియోజకవర్గంలోనే 75 వేల ఎకరాల్లో పంట సాగైంది. అయితే మార్ఫెడ్ పెట్టిన కఠిన నిబంధనల వల్ల కౌలు రైతులు మద్దతు ధరకు పంటను అమ్ముకోలేకపోతున్నారు. ప్రైవేటు వ్యాపారుల దయ కోసం వేచిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో సాగవుతున్న మొకజొన్నలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించి, ఇతర పెట్టుబడులు పెట్టి పంట పండిస్తున్నారు. కానీ పంట విక్రయ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.
26 క్వింటాళ్ల పరిమితి నిబంధన వద్దు
జాతీయ రహదారిపై అఖిలపక్ష నేతలు, రైతుల రాస్తారోకో
వైరా టౌన్, ఏప్రిల్ 14: కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు మొక్కజొన్న పంట అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గొల్లపూడి గ్రామంలోని జాతీయ రహదారిపై అష్ణగుర్తి, గొల్లెనపాడు, పాలడుగు, రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో చేపట్టారు. పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో 26 క్వింటాళ్ల పరిమితి నిబంధన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
కఠిన నిబంధనలు పెట్టొద్దు
మా గ్రామంలో నేను 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని యాసంగి పంట మొకజొన్న సాగు చేశాను. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 26 క్వింటాలే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఈ నిబంధనలను ఎత్తివేసి కౌలు రైతులు సంబంధించిన వివరాలు తీసుకొని మొకజొన్నలను కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి.
-భూక్యా రమేశ్, కౌలు రైతు, రావినూతల, బోనకల్లు
అమ్ముకునే హకు లేదా?
కౌలు రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మార్కెట్లో అమ్ముకోడానికి హక్కు లేదా? మా గ్రామంలో నేను 30 ఎకరాలను కౌలుకు తీసుకున్నాను. ఆ భూయజమానులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ యాసంగి మొకజొన్న పంటను అమ్ముకోడానికి వెళ్తే.. భూ యజమాని రావాలని అధికారులు చెబుతున్నారు. వారు రారు. మరి పండించిన పంటను ఎకడ అమ్ముకోవాలి.
-కొమ్మినేని ఉపేందర్, కౌలు రైతు, రావినూతల, బోనకల్లు
ఇబ్బంది పడుతున్నాం
మా గ్రామంలో నేను ఆరు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకొని మొకజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.40 వేల పెట్టుబడి పెట్టారు. ఎకరానికి 35 నుంచి 40 కింటాళ్ల దిగుబడి సాధించాను. ఇప్పటివరకు ప్రభుత్వం మండలానికి ఒక మొకజొన్న కొనుగోలు కేంద్రం మాత్రమే ఏర్పాటు చేసింది. దీంతో రైతులు అక్కడికి వెళ్లి పంటను విక్రయించుకోలేకపోతున్నారు. కౌలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ప్రైవేట్ మారెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది దీనివలన రైతుకు ఎకరాకు రూ.25 వేలు నష్టం వస్తోంది.
-బోయినపల్లి నాగేశ్వరరావు, కౌలు రైతు, రావినూతల, బోనకల్లు