వరంగల్, ఏప్రిల్14 : చెత్త సమస్య బల్దియాకు సవాల్‌గా మారింది. రాంపూర్‌లోని డంపింగ్ యా ర్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త ఆందోళన కలిగిస్తున్నది. శాశ్వత పరిష్కారం కోసం రూ.800కోట్ల అంచనాతో రూపొందించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రణాళికలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయా..? అన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ సిర్సపల్లి గ్రామంలోని 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలన్న ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌పై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరో చోట స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో అయ్యే పనికాదనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి కేవలం పొడి చెత్త మాత్రమే అవసరం ఉంటుంది. దీంతో నగరంతోపాటు కరీంనగర్ కార్పొరేషన్, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, హుస్నాబాద్ మున్సిపాలిటీల పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌కు తరలించే ప్రతిపాదనలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సర్కారు డైలామాలో పడింది. దీంతోపాటు ప్లాంట్ ఏర్పాటుపై అధ్యయనం చేసిన అంతర్జాతీయ సంస్థలు అనేక అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. చుట్టూ 10 కిలోమీటర్లు చేపట్టాల్సిన చర్యలపై ప్రశ్నించినట్లు తెలిసింది.
దీనిపై సమాధానం చెబితేనే ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొస్తామని ఆయా సంస్థలు స్పష్టం చేసి, ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ప్లాంట్ ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటన్న దానిపై అధ్యయనం చేసిన అనేక సంస్థలు ప్రశ్నలు వేస్తున్నాయి. ఇటీవల నగరంలో పర్యటించిన జర్మనీకి చెందిన కేడబ్ల్యూఎఫ్ సంస్థతో పాటు సీడీఎంఏ ఏర్పాటు చేసిన సంస్థ అధ్యయనం చేసి పలు ప్రశ్నలు సంధించాయి. ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రాంతం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటలు, వ్యవసాయ భూముల పరిరక్షణ, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగకుండా తీసుకుంటున్న చర్యలు ఏంటో తెలపాలని సూచించాయి. అప్పుడే ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశాయి.
ప్రజాగ్రహంతో వెనకడుగు..
రాంపూర్ నుంచి డంపింగ్ యార్డు ఎత్తేయాలని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఒక వైపు, హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వద్దంటూ ఆక్కడి ప్రజలు మరోవైపు ఆందోళనలు చేస్తున్నారు. ప్రజా ఆగ్రహంతో వరంగల్ నగరానికి చెత్త డంపింగ్ తలనొప్పిగా మారింది. ఇటీవల రాంపూర్ నుంచి డంపింగ్ యార్డును ఎత్తేయాలని అక్కడి ప్రజలు ఏకంగా నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక్కడ ప్లాంట్ వద్దంటూ సిర్సపల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. ప్రజల ఆందోళనలతో ప్రస్తుతం సర్కారు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నది. దీనికి తోడు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్లాంట్ ఏర్పాటుకు చుట్టూ 10కిలోమీటర్ల దూరం ప్రజా జీవనానికి హాని కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు చేశాయి. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
బల్దియాలో బయో మైనింగ్ విఫలం
రాంపూర్ డంపింగ్ యార్డులో చెత్త గుట్టలు పేరుకుపోతున్నాయి. చెత్త గుట్టలను తగ్గించేందుకు బల్దియా చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ సక్సెస్ కాలేదు. నాలుగేళ్లుగా కొసాగుతూనే ఉన్నది. పాత చెత్తతోపాటు కొత్తగా ప్రతిరోజూ తరలిస్తున్న చెత్త ఇప్పటికే డంపింగ్ యార్డులో 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పేరుకుపోయింది. ప్రతి రోజూ సుమారు 450 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యే వరంగల్ మహానగరానికి బయోమైనింగ్ విధానం సరైంది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ప్రజా ఆందోళనల మధ్య గందరగోళంగా మారింది.