దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతున్నది. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలతో ఉన్న దేశం త్వరలో గరిష్ఠంగా 850 స్థానాలకు విస్తరించబోతున్నది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. ఇందుకోసం ఈ నెల 16, 17,18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అమల్లోకి రానున్నది. దీంతో పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించనున్నారు. ఈ రెండు పరిణామాలతో దేశ రాజకీయ స్వరూపం, స్వభావం సమూలంగా మారిపోనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను సంప్రదించలేదని, అభిప్రాయాలు సేకరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలు సీట్ల పెంపు విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలు చెప్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ‘ఎలాంటి అన్యాయం జరుగదు’ అని నోటిమాటగా చెప్తున్నదే తప్ప, తమ అనుమానాలను నివృత్తి చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ 2029లో జరగాల్సి ఉండగా, ఇంత అత్యవసరంగా మూడేండ్ల ముందుగానే చేయాల్సిన అవసరం ఏమున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లులను ఆమోదింపజేసేందుకు సిద్ధమైందని వివిధ రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) సంబంధించిన మూడు బిల్లులను గురువారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. ఈ మూడింటికి సంబంధించిన బిల్లుల ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంగళవారం ఎంపీలకు అందించింది. డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 545 లోక్‌సభ స్థానాలు (2 ఆంగ్లో ఇండియన్ సీట్లు కలుపుకొని..) గరిష్ఠంగా 850కు పెరుగనున్నాయి. రాష్ర్టాల్లో 815 వరకూ లోక్‌సభ సీట్లు పెరుగనుండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీల్లో) 35 వరకూ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నది. పెరిగిన లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. సీట్ల పెంపులో దామాషా ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తున్నది.
గురువారం ప్రారంభమయ్యే లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా ప్రవేశపెట్టడానికి కేంద్రం సమాయత్తమైంది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగనున్నట్టు తెలుస్తున్నది. డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. కమిషన్ సూచనలతో సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్టు సమాచారం. కాగా, డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ర్టాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కమిషన్‌కు సహాయ సహకారాలు అందించడానికి ప్రతీ రాష్ట్రం నుంచి ఐదురుగు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రతిపాదిస్తారు. ఎంపీల పేర్లను లోక్‌సభ స్పీకర్, ఎమ్మెల్యేల పేర్లను అసెంబ్లీ స్పీకర్ సిఫార్సు చేస్తారు. అయితే, కమిషన్ తీసుకొనే నిర్ణయాల్లో వీరి జోక్యం ఉండదు. ఐదు కంటే తక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ర్టాలు, యూటీల్లో మిగతా సభ్యులను ఎమ్మెల్యేలతో భర్తీ చేస్తారు.
ఆర్టికల్ 82 మూడో ప్రొవిజన్ తొలగింపు 2026 తర్వాత జరుగనున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహించాలని ఆర్టికల్ 82లోని మూడవ ప్రొవిజన్ చెబుతున్నది. ఇప్పుడు ఈ ప్రొవిజన్‌ను తొలగించనున్నారు. దీంతో 2026 కంటే ముందు ఉన్న జనగణన డాటా ప్రకారం (అంటే 2011 జనగణన) డీలిమిటేషన్‌ను చేపట్టడానికి మార్గం సుగమమయ్యే అవకాశం ఉండనున్నది.
లోక్‌సభ గరిష్ఠంగా 550 సీట్లకు మాత్రమే పరిమితం కావాలని ఆర్టికల్ 81 చెబుతున్నది. ప్రస్తుతం లోక్‌సభలో 545 స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్యను 850కు పెంచడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 81కు సవరణను ప్రతిపాదించింది. పెరిగిన స్థానాల్లో రాష్ర్టాలకు గరిష్ఠంగా 815 సీట్లు, యూటీలకు గరిష్ఠంగా 35 సీట్లు కేటాయిస్తారు.
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ మేరకు ఆర్టికల్ 334ఏకు సవరణలు ప్రతిపాదించారు.
ఆర్టికల్స్ 81(2), (3) ప్రకారం.. 1971 జనాభా లెక్కలను అనుసరించి లోక్‌సభ సీట్లను 545గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు అవి850కు పెరుగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆర్టికల్స్‌ను సవరించనున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. కమిషన్ ఒకసారి అధికారికంగా గెజిట్‌ను విడుదల చేస్తే, అది చట్టంగా మారినట్టే. దాన్ని ఎవరూ ఏ న్యాయస్థానంలోనూ సవాల్ చేయలేరు.
పార్లమెంట్లో ఆయా రాష్ర్టాలకు ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతామని ఇప్పటివరకూ కేంద్రం చెబుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్న లోక్‌సభ సీట్లను 50 శాతం మేర పెంచనున్నట్టు పేర్కొన్నది. ప్రతి రాష్ర్టానికీ ఈ పెంపు సమానంగా వర్తిస్తుందని ఇటీవల పలు పార్టీలకు కూడా సమాచారమిచ్చింది. అయితే, తాజా బిల్లులో మాత్రం అత్యంత కీలకమైన ‘50 శాతం సీట్ల పెంపు’ విషయాన్ని కేంద్రం ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా లోక్‌సభ, రాష్ర్టాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మొత్తం ప్రక్రియను డీలిమిటేషన్ కమిషనే నిర్వహిస్తుందని, 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని బిల్లు ప్రతుల్లో చెప్పింది. నియోజకవర్గాల హద్దులు కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే కమిషన్ నిర్ణయిస్తుందని పేర్కొన్నది. అంటే, ఇప్పటివరకూ కేంద్రం చెప్పినట్టు ‘50 శాతం సీట్ల పెంపు’ అనేది కుదరకపోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఇటీవల వివిధ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ‘50 శాతం సీట్ల పెంపు’ ప్రాతిపదికన ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543 (2 ఆంగ్లో ఇండియన్ సీట్లు కాకుండా..) నుంచి 816కి చేరుకోనున్నట్టు పేర్కొన్నది. అయితే, తాజా బిల్లులో మాత్రం లోక్‌సభ సీట్లు 850గా కేంద్రం ప్రతిపాదించింది. దీంతో ‘50 శాతం సీట్ల పెంపు’ నిర్ణయం అబద్ధమేనని విపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజా ప్రతిపాదనలతో దక్షిణాది రాష్ర్టాలకు పార్లమెంట్లో ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యం భవిష్యత్తులో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. డీలిమిటేషన్ చేపట్టడమే దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.
‘50 శాతం సీట్ల పెంపు’ నిర్ణయాన్ని బిల్లులో కేంద్రం ప్రతిపాదించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాభవం ఎక్కువగా ఉన్న ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ర్టాలకు మేలు చేస్తూ ఆయా రాష్ర్టాల్లో సీట్లను పెంచుకోవడానికే కేంద్రం ఇలాంటి లోపభూయిష్ట ప్రతిపాదనలు తీసుకొచ్చిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే కమిషన్ డీలిమిటేషన్ నిర్వహిస్తే.. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయని, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా, తమ బలం ఎక్కువగా ఉన్న హిందీ బెల్ట్ రాష్ర్టాల ద్వారా ప్రయోజనానికి కేంద్రం యత్నిస్తున్నది.
లోక్‌సభతో పాటు 28 రాష్ర్టాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచుతామంటూ ఇటీవల కేంద్రం పలు పార్టీలకు తెలియజేసింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 4,123 అసెంబ్లీ స్థానాలు కూడా 6,185కు చేరుతాయని లీకులు ఇచ్చింది. కానీ, ఒక రాష్ట్ర శాసనసభకు గరిష్ఠంగా 500 సీట్లు మాత్రమే ఉండాలని ఆర్టికల్170 నిబంధన చెబుతున్నది. తాజా బిల్లులో ఈ ఆర్టికల్‌కు సవరణలు చేస్తున్నట్టు ఎక్కడా ప్రతిపాదించలేదు. పైగా లోక్‌సభ స్థానాలను పెంచుతున్నట్టు ప్రకటించారే గానీ, శాసనసభ స్థానాలపై ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో రాష్ర్టాల అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకొందా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.