e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Huzurabad | బీజేపీ బీసీల‌కు ప‌చ్చి వ్య‌తిరేకం : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య

Huzurabad | బీజేపీ బీసీల‌కు ప‌చ్చి వ్య‌తిరేకం : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య

క‌రీంన‌గ‌ర్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీలకు పచ్చి వ్యతిరేకని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. మండల కమిషన్‌ నుంచి బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని మండిప‌డ్డారు. గురువారం పెంచికల్‌పేటలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మెళనంలో కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ను ఈ సందర్భంగా సన్మానించి మాట్లాడారు.

చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కులాల‌వారీగా జనాభా లెక్కలు తీయాలని చెబితే బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఈ విషయాలపై ప్రధాని మోడీని కలిసి విన్నవించినపుడు ఒప్పుకున్నారని, ఆ తర్వాత ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి తప్పుకున్నా రని అన్నారు. మళ్లీ అడిగితే తాను నిమిత్తమాత్రున్ని అని మా ముందే చెప్పారని కృష్ణయ్య వివరించారు. బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్లు కావాలని, జనాభా లెక్కలు కులాల వారిగా తీయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇప్పటి వరకు స్పందించ లేదని అన్నారు. బీసీలంటే బీజేపీ చులకనగా చూస్తోందని, ఈ వర్గాలను ఏ నాడు పట్టించుకోలేదని అన్నారు.

- Advertisement -

అదే రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బీసీ గురుకులాలు స్థాపించి ఈ జాతులకు ఉన్నత విద్యను అందించేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టినపుడు తానే స్వయంగా వెళ్లి బీసీలకు కూడా ఇలాంటి పథకం పెట్టాలని చెప్పగా కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి అమలు చేశారని స్పష్టం చేశారు. ఇపుడు దళిత బంధు ప్రవేశ పెట్టినపుడు కూడా తాను వెళ్లి కలిశానని, బీసీ బంధు కూడా పెడతామని తనకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఆర్‌ కృష్ణయ్య చెప్పారు.

కేసీఆర్‌పై తనకు ఎంతో విశ్వాసం ఉందని, త్వరలో బీసీ బంధు పెడతారనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి పొరుగున ఉన్న కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రజలు తమను తెలంగాణలో కలుపుకొమ్మని విజ్ఞప్తులు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ అమలవుతున్న ఏ పథకం కూడా ఆ రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు. స్వర్గదామంగా ఉన్న తెలంగాణలో బీసీలు గొప్పగా బతుకుతున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఈ వర్గాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు.

హుజూరాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల్లో సానుభూతిని చూసో, బట్టెబాజి మాటలు నమ్మో మోసపోవద్దని, మనకు ఎవరు మేలు చేస్తున్నారో చూసి, ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. హుజూరాబాద్‌ నుంచి ఎందరో బీసీ నాయకులు తనతో ఉద్యమాలు చేశారని, ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ కూడా తాను పార్లమెంట్‌పై రాళ్లు వేసినపుడు తనతోనే ఉన్నారని అన్నారు. బీసీలంటే ఎక్కడో పాకిస్తాన్‌, చైనా, అమెరికా నుంచి రాలేదని, ఇక్కడి భూమి పుత్రులమని, నికార్సైన హిందువులమని అన్నారు.

మతం పేరుతో రాజకీయాలు చేయడం సరైనది కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, ఒక్కసారి ఓటు వేస్తేనే ఇన్ని దారుణాలకు ఒడిగడుతున్న ఆ పార్టీకి మళ్లీ ఓటు వేయవద్దని ఆర్‌ కృష్ణయ్య కోరారు. బీసీల గోడు పట్టించుకోని బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పాల్గొన్న అక్కడ ఈ పార్టీ ఓటమికి బీసీలు కంకణబద్దులు కావాలని ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు.


బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ దేశ జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అన్నారు. కేంద్రంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరితే ఇప్పటి వరకు స్పందించ లేదని అన్నారు. బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చారని, ఈ లెక్కలు తేలితే బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని, హుజూరాబాద్‌లో ఈ పార్టీని ఓడిస్తేనే గుణ పాఠం వస్తుందని అన్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇంకా రాజారాం యాదవ్‌, వివిధ కుల సంఘాలకు చెందిన రాష్ట్ర నాయకులు గాదె సమ్మయ్య, శివాజి, రాజ్యలక్ష్మి, జయంత్‌రావు, డాక్టర్‌ కే శ్రీనివాస్, సాయిపటేల్‌, కోల శ్రీనివాస్, గోనే శ్రీనివాస్, వైద్య వెంకటేశ్వర్లు, మంద రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌ కృష్ణమోహన్‌ను, ఆర్‌ కృష్ణయ్యతోపాటు వివిధ బీసీ కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement