ప్రపంచంలో మొట్టమొదటి అణ్వస్త్ర దేశం అమెరికా. అణుబాంబుతో దాడి జరిపిన దేశం కూడా అమెరికాయే. ఇప్పుడు అదే అమెరికా మరోసారి అణుపరీక్షలు జరుపబోతున్నదని వెలువడుతున్న వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. 33 ఏండ్ల విరామం తర్వాత అణుపరీక్షలు ఎందుకు ఆదేశించారన్న ప్రశ్నకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపుతున్న కారణాలు కొంత హాస్యాస్పదంగానే ఉన్నాయి. రష్యా, చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియా జరుపుతున్నాయి కనుక తామూ జరుపుతామని ఆయన అంటున్నారు. తమ వద్దనున్న అణ్వాయుధాల విశ్వసనీయతను నిర్ధారించుకునేందుకు అణుపరీక్షలు తప్పవనేది ఆయన వాదన. అయితే కొన్ని దశాబ్దాలుగా ఉత్తర కొరియా తప్ప మరే దేశమూ అణుపరీక్ష జరిపిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అమెరికా తీరు తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
పాక్‌తో సహా మిగతా దేశాలన్నీ రహస్యంగా, భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ ‘సీబీఎన్ 60 మినిట్స్’ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. దీంతో పొరుగుదేశం కదలికలపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఆపరేషన్ సిందూర్ జరుగుతుండగా పాక్ అణ్వస్ర్తాల ప్రస్తావన తెచ్చి భారత్‌ను భయపెట్టాలని చూసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపుగా ఆ సమయంలోనే పాక్ భూగర్భ రహస్య అణుపరీక్షలు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏప్రిల్, మే మాసాల్లో పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో రిక్టర్ స్కేల్‌పై 4, 4.7 పాయింట్ల భూకంపాలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 1998లో పాక్ జరిపిన అణు పరీక్షలతో సమంగా ఉండటం అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే అప్పులతో నెట్టుకొస్తున్న పాక్ ఆ రెండు సంస్థల షరతుల కారణంగా అణుపరీక్షలు జరిపే సాహసానికి ఒడిగట్టబోదనేది నిపుణుల నిశ్చితాభిప్రాయం.
ప్రస్తుత అస్పష్ట పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ అమెరికా అణుపరీక్షలను పునరుద్ధరిస్తే భారత్ తనకు తానుగా విధించుకున్న అణుపరీక్షల నిషేధాన్ని వదిలిపెట్టి హైడ్రోజెన్ బాంబు పరీక్షలను చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. అణ్వస్ర్తాలతో ఎదురుదాడి తప్ప ప్రథమ దాడి జరపబోమనే విధానం భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను తాను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు పదే పదే చెప్పుకుంటున్నారు. ఇంతగా యుద్ధ నివారణకు కృషి చేసినందుకు నోబెల్ శాంతి బహుమతి తనకే రావాలని ట్రంప్ మంకుపట్టు పట్టారు కూడా. అయితే, అదే ట్రంప్ తాజాగా అణుపరీక్షలకు ఆదేశించడం ఆయుధ పోటీని పెంచే అవకాశాలున్నాయి.
ప్రతిదానికీ టారిఫ్‌ల పేరు చెప్పి అదుపు చేయాలని చూసే ట్రంప్ పాక్ అణుపరీక్షలు జరిపిందని చెప్పడాన్ని ఎలా చూడాలి? చాటుగా జరిపినా, నేరుగా జరిపినా ఆపడానికి, ఆపై అదుపు చేయడానికి తనదైన రీతిలో స్పందించాల్సిన అమెరికా తానూ ఆయుధ పోటీకి దిగడం సరికాదు. అస్థిర ప్రపంచంలో అగ్రరాజ్యం తీరు ఆయుధపోటీకి ఆజ్యం పోసేదిగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పనిలోపనిగా అణ్వస్త్ర నిరోధక ఒప్పందాలను, ఇతర అంతర్జాతీయ నిబంధనలను గాలికి వదిలేయడం దేశాల శాంతియుత సహజీవనానికి తీవ్ర విఘాతం కలిగించే విషయమని చెప్పక తప్పదు.