చేవెళ్ల రూరల్, నవంబర్ 4 : హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163) విస్తరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న ది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడిచినా పనులు ప్రారంభమే కాకపోవడంతో ప్రయాణికు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్రిచెట్లపై ఎన్టీజీలో కేసు కారణంగా నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ(46 కిలోమీటర్లు) రోడ్డు పనులకు 2025, అక్టోబర్ 31న అడ్డంకులు తొలగిపోయాయి. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. రేవంత్ సర్కార్ మాత్రం మొద్దు నిద్రను వీడడంలేదు. తరచూ ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
మర్రి చెట్ల రక్షణకు వేసిన కేసుతో..
సేవ్ బనియన్ స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో వేసిన కేసు కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణ పనులు నిచిపోయాయన్నది వాస్తవమే అయినా న్యాయపరమైన చిక్కులను తొలగించడం లో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని రోడ్డు ప్రమాదాల తీవ్రత, రోడ్డు విస్తరణ ఆవశ్యకతపై సమన్వయంతో ముందుకెళ్తే కేసు పరిష్కారమయ్యేదని పలువురు వాహనచోదకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడుతున్నారు.
ఆలూరు ఘటన మరువక ముందే..
10 నెలల కిందట మండలంలోని ఆలూర్ గేట్ సమీపంలో కూరగాయలు విక్రయించే రైతులపైకి లారీ దూసుకెళ్లగా ఐదుగురు మృతి చెందిన ఘటన మరువకముందే ..మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పడమే తప్పా పనులు స్టార్ట్ అయ్యే ది లేదు పొయ్యింది లేదని వాహనచోదకులు మండిపడుతున్నారు.
పనులు ప్రారంభించకపోవడం విడ్డూరం..
సీఎం, స్పీకర్ సొంత సెగ్మెంట్లకు వెళ్లే ప్రధాన మార్గం అయిన హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణపై రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోకపోవడం విడ్డూరంగా ఉన్నదని పలువురు ప్రయాణికులు మండిపడితున్నారు. ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు గడిచినా ఈ రోడ్డు పనులను ఇంకా ప్రారంభించకపోవడంపై ఇక్కడి రోడ్ల నిర్మాణానికే దిక్కు లేదు. రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేస్తాడని సీఎం రేవంత్‌రెడ్డిపై పలువురు వాహనదారులు, స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇకనైనా పనులు ముందుకు సాగేనా..?
కోర్టులో న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఇకనైనా రహదారి విస్తరణ పనులు ముందుకు సాగుతాయా..? లేదా..? అన్న సందేహం కలుగుతున్నాదని వాహనదారులు పేర్కొంటున్నారు.
ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి పట్టింపు లేదు..
హైదరాబాద్‌బీజాపూర్ హైవే విస్తరణకు నిధులున్నా ప్రభుత్వం జాప్యం చేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరిగి ఎందరో మృతి చెందుతున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. మొద్దు నిద్ర వహిస్తున్న రేవంత్ సర్కార్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారు. ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదని మండిపడుతున్నారు. సర్కార్ వెంటనే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించకుంటే మరో ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది.
– చటారి దశరథ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి