బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికాకు 16వ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ‘ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు ఏర్పర్చుకున్నది ప్రజాస్వామ్యం’ అని. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న ప్రజాస్వామ్యాల దేశాలను పరిపాలించే ప్రభుత్వాలు ఈ విధంగా నడుస్తున్నాయా అన్నది సందేహాస్పదమే! ఎందుకు ఈ అనుమానాలు కలుగుతున్నాయో విశ్లేషిద్దాం!
అగ్రరాజ్యాన్ని అనుకునే ఉగ్రరాజ్యం, అమెరికా సంగతి మొట్టమొదట తీసుకుందాం. మిగతా దేశాలన్నీ తమ తమ పరిశ్రమలు రూపొందించిన లేక వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులను, పంటలను విదేశాలకు ఎగుమతి చేసి ధనం సంపాదించుకుంటే, అమెరికా ముఖ్యంగా యుద్ధ సామగ్రి అమ్మి బతుకుతుంది. మరి, ఏ దేశంలోనైనా ఆ ప్రజలే వారి ప్రభుత్వాలను ఎంచుకొని మనుగడ సాగించాలన్నది ప్రజాస్వామ్య సిద్ధాంతమైతే, వేరే దేశాల అంతర్గత విషయాల్లో కల్పించుకోవటం, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించటం, లేదా రెండు దేశాల మధ్య వైరం ఉంటే వాటిలో ఒక దేశాన్ని ఎగదొయ్యడానికి అమెరికాకు హక్కు ఎలా ఉంటుంది? ఏ విధంగా తన యుద్ధ సామగ్రి అమ్ముకోవటానికి ఆ దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగించవచ్చు?
ఇక మన దేశ ప్రస్తుత పరిస్థితి చూద్దాం. మేధావులు చెప్పినట్టు ఒక దేశం, జాతి పరాయి పాలన నుంచి బయటపడగానే స్వాతంత్య్రం రాగానే, ప్రజాస్వామ్య దేశం అయిపోదు. ఆ స్వాతంత్య్రం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, వ్యక్తిగత స్వేచ్ఛలను సాధించినప్పుడే ఆ దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అనవచ్చు. దేశంలోని ప్రకృతి వనరులు, సృష్టించుకున్న సంపద బ్రిటిష్ వాడు దోచుకుంటే ఏమిటి, అదానీ, అంబానీ దోచుకుంటే ఏమిటి వ్యత్యాసం? సామాన్య ప్రజల కష్టాలు అలాగే ఉంటాయి కదా! మరి ఈ కోట్లాది సామాన్య ప్రజలకు నష్టం కలిగే విధానాలు ఎన్నుకున్న నాయకులు పాటిస్తుంటే వారిని నిలదీసే హక్కు లేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఐదేండ్లకు ఎన్నుకున్నా, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని ఆపే హక్కు ఇవ్వని రాజ్యాంగం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలదు? అక్రమ సంపాదనతో బలిసిన బడా వ్యాపారస్థుల బ్యాంకు రుణాలు లక్షల్లో మాఫీ చేసి, సామాన్యుల రోజువారీ అవసరాలను తీర్చే వస్తువుల మీద జీఎస్టీలు వేయడం ప్రజాస్వామ్యమా? ఇది ప్రశ్నించి ఆపే హక్కు లేనప్పుడు ఈ ప్రభుత్వం నియంత అవుతుంది కానీ ప్రజల హితోభిలాషి అవదు కదా! ఆలోచించండి.
కాంగ్రెస్ పార్టీ అవినీతి భరించలేక 2014లో బీజేపీని ప్రజలు గెలిపించి కేంద్ర ప్రభుత్వంలో నిలబెడితే, దేశ ప్రజల పరిస్థితి ‘దుంగ వదిలి మొద్దు ఎత్తుకున్నట్టయింది’ అవినీతి రాజకీయ నాయకులకు ఆ పార్టీ రక్షణ ఇవ్వడమే కాకుండా, ఆశ్రిత పక్షపాతం, అంతులేని వివక్ష, మత విద్వేషాలను రగిలిస్తూ దేశ ప్రజల సంస్కృతినే నాశనం చేసింది, చేస్తోంది బీజేపీ. 0.31 శాతం కుబేరుల దగ్గర 98 శాతం దేశ సంపద చేరింది.
2014 నుంచి 2024 దాకా ధనవంతుల సంఖ్య ప్రతి ఏడాదీ రెట్టింపవుతుంటే ఆ కాలంలో 20 కోట్ల మంది సామాన్యులు దారిద్య్ర రేఖ కిందికి జారిపోయారు. ఇంకో మూడేండ్లలో బహుశా ఇంకో 10 కోట్ల మందికి ఈ స్థితి వస్తుందనీ అంచనాలు చెప్తున్నాయి. నరేంద్ర మోదీకి బీదరికాన్ని అంతం చెయ్యటమంటే బీదవాళ్లను లేకుండా చేయటమేనా అనిపిస్తున్నది పరిస్థితిని చూస్తుంటే.
ఇక తెలంగాణ రాష్ర్టానిది భారతదేశంలోని అన్ని రాష్ర్టాలకంటే దురదృష్టం. తెలంగాణది ఎందుకు దురదృష్టమంటే, ఇంతవరకు నిజమైన ప్రజాస్వామ్యంలో సామాన్య జనాలకు మంచి జరిగింది లేదని ప్రజల అనుభవం, అలాంటిది ఒక మాతృభూమి ప్రేమికుడు, మేధావి, ప్రజ్ఞావంతుడు, నిజమైన దార్శనికత కలిగి, తాను రూపొందించిన పథకాలను ఆచరణలో పెట్టి ఫలాలు సామాన్యులకందించగలిగిన ధైర్యవంతుడు ముఖ్యమంత్రిగా ఎన్నికై సుమారు తొమ్మిదిన్నరేండ్లు అద్భుత పరిపాలన చేసిన నాయకుడు 2024లో ఓడిపోవడం, గతంలో సుమారు దశాబ్దాలు ఉమ్మడి ఏపీని పాలించి తెలంగాణ సంపదను దోచుకొని, సుందర హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేసి తెలంగాణ జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా చేసిన కాంగ్రెస్ పార్టీ 2023లో గెలిచి అధికారాన్ని చేపట్టడం నిజంగా తెలంగాణ ప్రజల దురదృష్టం. ప్రజాపాలన చేస్తానన్న రేవంత్ రెడ్డి, నిజమైన తన ధోరణి పాలన రుచి చూపిస్తున్నాడు. పూర్వ ప్రభుత్వం పథకాలన్నీ బందయ్యాయి. ఆయన ఉద్దేశ్యం ప్రజలే వారి బతుకులు చూసుకోవాలని. వివరంగా చెప్పాలంటే, హైడ్రా స్కీము తీసుకోండి. ప్రభుత్వ పెద్దగా ఆయన ప్రభుత్వ భూములు కాపాడుకున్నాడు. ఆ భూముల్లో ఇండ్లు కూల్చేస్తే ప్రజలే వారి సంగతి వారు చూసుకోవాలి. న్యాయమే కదా! అలాగే ఇన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్న రైతులకు డబ్బులివ్వటమేమిటి? వారే తమ భూమిలో పంట పండించుకోవాలి. మరి పండించినవాడికి, అమ్ముకోవటం తెలియాలి. ప్రజల కుటుంబాల్లో ఆడపిల్లలని కన్నప్పుడు వాళ్ల పెండ్లి బాధ్యత తల్లిదండ్రులదే కదా! కల్యాణలక్ష్మి ఎందుకు? నిరుద్యోగులు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. లేకపోత బడే భాయ్ మోదీ చెప్పినట్టు పకోడీలు చేసి అమ్ముకోవాలి. అది కూడా ఉపాధే కదా! మరి ప్రభుత్వం మాత్రం ఎందరికని ఉద్యోగాలివ్వగలదు? ఇలా పథకాలు మప్పేకంటే ప్రజలు వారిని వారే పాలించుకోవాలి, అదే నిజమైన ప్రజాపాలన ప్రజాస్వామ్యంలో.
మరిప్పుడు జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటెయ్యం అని ప్రజలు అనటంలో న్యాయముందా? నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వ్యక్తి గెలువకపోతే ఇప్పుడిచ్చిన అరకొర పథకాలు కూడా రావు కదా!
ఆ వ్యక్తి ఎవరు, ఆయన నేపథ్యం, తండ్రి, తమ్ముడు అనకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ప్రస్తుత ముఖ్యమంత్రి అద్భుత పాలన చూసి కదా. ఈ ఉప ఎన్నికలో ప్రజలు ఓటెయ్యాలి. అట్లా వేస్తేనే అక్కడ నిజమైన ప్రజాపాలన చేసుకోవచ్చు. పాడైన రోడ్లు ప్రజలే వేసుకోవచ్చు. ఎన్నికల తర్వాత ఏవైనా ఇళ్లు బుల్డోజర్ కూల్చేస్తే వారి ఇళ్లు వారే కట్టుకోవచ్చు. ఎందుకంటే లక్ష ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినవి నిన్ననే రద్దు చేశారు. వారి పిల్లల పెళ్ళిళ్లు వారే చేసుకోవచ్చు. అదే కదా ప్రజా పాలన.
చివరికి 2023లో జరిగిన ఎన్నికల ఫలితలు ఎలా ఉన్నాయంటే, ఎన్టీఆర్ నటించిన ‘కృష్ణలీలలు’ సినిమా అనుకొని థియేటర్‌కు వెడితే, అక్కడ నాగభూషణం నటించిన ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ సినిమా ఆడుతున్నట్టయింది ప్రజలందరికీ, ఇప్పుడైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సరైన పార్టీకి, సరైన వ్యక్తికి ఓటెయ్యాలని విజ్ఞప్తి.