ఇద్దరికి మించి పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేస్తూ గత నెల 23న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదించడం హర్షణీయం. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీచేసే వారికి ఇద్దరు పిల్లల నిబంధన సెక్షన్: 21/3. చట్టం, 1995, మే 31 (2018)ను రద్దు కోసం ఏడేండ్లుగా పోరాటం చేస్తున్నాను. నా ఏడేండ్ల పోరాటం ఇన్నాళ్లకు విజయం సాధించినందుకు ఆనందంగా ఉన్నది.
ఇద్దరికి మించి పిల్లలున్న నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత నా లాంటి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పలు రాజకీయ పార్టీలలో మేం కార్యకర్తలుగానే మిగిలిపోయాం. ఇంకో విచిత్రమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ సభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే, పదవులు అనుభవించే వీళ్లకు జనాభాను నియంత్రించవలసిన అవసరం లేదట. ఎంతమంది పిల్లలున్నా వీరు ఎన్నికల్లో యథేచ్ఛగా పోటీ చేయవచ్చు, పదవులు అనుభవించవచ్చట. ఈ చట్టాన్ని నాటి పాలకులు తమకు చుట్టంగా మార్చుకున్నారు. కానీ, ఎలాంటి చట్టాలు చేసే అవకాశం లేని వార్డుమెంబర్లు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నీటి తీరువా, డైరెక్టర్, చైర్మన్ పదవులకు పోటీ చేసేవారు మాత్రమే రాష్ట్ర జనాభాను తగ్గించాలంటూ దురుద్దేశంతో దుర్మార్గపు జీవో జారీచేయటం విడ్డూరం.
ఈ జీవో కారణంగా ఎంతోమంది యువతీ యువకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోయారు. పోటీచేయడం కోసం రేషన్‌కార్డ్‌లో ముగ్గురు పిల్లలు కలిగినా ఇద్దరే పిల్లలున్నారని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసినవారు కోకొల్లలు. మూడోసారి భార్య గర్భం దాల్చితే అబార్షన్లు చేయించినోళ్లూ ఉన్నారు. మూడో సంతానాన్ని అమ్ముకున్నోళ్లూ ఉన్నారు. ఇంకొందరు ఇద్దరు పిల్లల తర్వాత కు.ని. ఆపరేషన్లు చేయించుకున్నోళ్లూ ఉన్నారు. అలా కు.ని. చేయించుకున్న వాళ్లు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటాలు చేసినవారే. వారు గ్రామాల్లో పోటీచేస్తే సునాయాసంగా గెలిచే సత్తా ఉన్నప్పటికీ పిల్లల నిబంధన ఉండటంతో ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశాన్ని వాళ్లు కోల్పోయారు. నేనే కాదు, నాతో పాటు చాలామందే రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోయారు. మా లాంటి దౌర్భాగ్య స్థితి రాబోవు తరాలవారికి రాకూడదనే ఉద్దేశంతోనే నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కల్పించాలని పోరాడాను. ఇద్దరు పిల్లల నిబంధనను ఖండించాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేయాలని పోరాడాను. ఎంతోమంది నన్ను పరోక్షంగా, ప్రత్యక్షంగా బెదిరించారు కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్లకు అవకాశం వస్తే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతారనే భయం వాళ్లకు పట్టుకున్నది.
2024, అక్టోబర్ 13 నుంచి 15 వరకు నా స్వగ్రామంలో మూడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగాలనే ఉద్దేశంతో రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లోని ఇందిరాపార్క్ 2025, అక్టోబర్ 14వ తేదీన ఒక రోజు దీక్ష చేశాం. అదేవిధంగా జీఓ రద్దు కోసం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్లు పెట్టాం. కంటికి నిద్రలేని ఎన్నో రాత్రులను గడిపాను. ఇద్దరు పిల్లల నిబంధనను రద్దుచేయాలని నేను ఎక్కని మెట్టు లేదు. మొక్కని మనిషి లేడు. ఈ సందర్భంలో మా దీర్ఘకాలిక సమస్య పరిష్కారంపై కోసం కొందరు సానుకూలంగా స్పందిస్తే, కొందరు హేళనలు చేశారు. అయినా ఎక్కడా వెరవలేదు. 30 ఏండ్ల కిందట చంద్రబాబు మాపై మోపిన గుదిబండను ఎలాగైనా తొలగించుకోవాలనే కంకణం కట్టుకొని పట్టు వదలని విక్రమార్కుడి వలె పోరాడి విజయం సాధించాను. ఆ పోరాట ఫలమే ఇద్దరు పిల్లల జీవో ఎత్తివేత. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందరూ పిల్లలున్నా పోటీ చేయచ్చనే ప్రకటన మాలాంటి వారికి ఎంతో ఊరటనిచ్చింది. ఇద్దరికి మించి పిల్లలున్నవాళ్లు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ ఏడేండ్ల పోరాటం నేపథ్యంలో నాకు సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు.