పాట్నా: తెలంగాణలో నకిలీ ఓటర్లను ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ స్పందించని ఎన్నికల సంఘం.. జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు రెండు ఓటర్‌కార్డులు ఉన్నాయన్న ఆరోపణలపై మాత్రం ఆగమేఘాలపై స్పందించింది. దీంతో ఈసీ ద్వంద్వ నీతిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని ఓటర్ల జాబితాలో ప్రశాంత్ కిశోర్ పేరున్నట్టు తేలడంతో ఈ విషయమై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు.
బీహార్‌లోని కర్గహర్, బెంగాల్‌లోని భబనిపూర్ నియోజక వర్గాల్లో ప్రశాంత్ కిశోర్‌కు ఓటు ఉన్నట్టు ఈసీ తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో ఓటరుగా నమోదవకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.