సిద్దిపేట టౌన్, అక్టోబర్ 28: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. సుప్రీంకోర్టు సీజేఐ గవాయిపై దాడి చేసిన వ్యక్తిపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.జార్ఖండ్‌లో జడ్జితో న్యాయవాది వాగ్వాదం చేసినందుకు, అదే విధంగా రౌడీషీటర్‌ను ఎన్కౌంటర్ చేస్తే సుమోటోగా మానవ హక్కుల సంఘం కమిషన్ కేసులు నమోదు చేసిందన్నారు. కానీ, సీజేఐపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీజేఐ గవాయి రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం తీసుకున్నారని, ఇంతకు ముందు ఏ ప్రధాన న్యాయమూర్తి చేయనివిధంగా బలహీన వర్గాలకు మేలు చేశారన్నారు.ప్రధాన న్యాయమూర్తి దళితుడు కావడం మూలంగా కేసు నమోదు చేయలేదన్నారు. సీజేఐపై దాడిని ఖండిస్తూ నవంబర్ 1న దళితుల ఆత్మగౌరవ ర్యాలీని హైదరాబాద్‌లో తలపెట్టామని, ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొడానికి కులమతాలకు అతీతంగా అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ప్రెస్‌క్లబ్ వద్ద చెఫ్పులు కుట్టే దుకాణాల దారులతో మాట్లాడి మందకృష్ణ చెప్పులు పాలిష్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు, యాదగిరి, పరశురాములు, రమేశ్, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.