దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే పరిచయస్తుడు ఒకరు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మేవారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఆ స్థితి నుంచి ఎకరాల్లో భూములు కొనే స్థితికి చేరుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మిత్రులతో కలిసి అమరావతిలో భూముల మీద కోట్లలో పెట్టుబడి పెట్టారు. 2018లో ఆయన పూర్తిగా ఢీలా పడిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లిపోయే పరిస్థితి. ఓ సారి కలుస్తానని నా దగ్గరికి వచ్చారు. అమరావతిలో భూములు కొని దెబ్బతిన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిలాగానే చాలామంది అమరావతి మరో హైటెక్ సిటీ అవుతుందని నమ్మి పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నారు.
మూడు దశాబ్దాల నుంచి ఆయన వద్ద నేను చిట్టీలు వేసేవాణ్ని. ఇదంతా విన్నాక నా ముఖంలో మార్పు చూసి ‘మీరు కంగారు పడవద్దు. మీ డబ్బు ఎక్కడికీ పోదు. హైదరాబాద్ బంగారం అన్నా. అమరావతిలో నిండా మునిగినా హైదరాబాద్ వల్ల తిరిగి నిలబడ్డా. ఎప్పుడో కోకాపేటతో పాటు అక్కడక్కడ ఎకరం, అర ఎకరం భూమి కొన్నా. ఆ భూములే ఇప్పుడు ఆదుకున్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇది తెలంగాణ ఏర్పడిన రెండేండ్ల తర్వాతి సంఘటన.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేండ్లు కావస్తున్నది. హైదరాబాద్‌లో పని చేసి రిటైర్ అయిన సీనియర్ జర్నలిస్ట్‌తో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, రియల్ ఎస్టేట్ పడిపోవడం లాంటి విషయాల గురించి మాట్లాడాను. ఆయన నన్ను మధ్యలోనే ఆపేసి, ఎక్కడి వరకో ఎందుకు, ఈ ఇబ్బందులకు తానే ప్రత్యక్ష బాధితుడినని తన బాధ చెప్పుకొచ్చారు. ‘మెదక్ జిల్లాలో నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. అమ్మాయి పెళ్లి కోసం అమ్మడానికి చూస్తే కొనేవారు దిక్కులేరు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రెండెకరాలు అమ్మేశా. అదే ధరకు సులువుగా ఇప్పుడూ అమ్మేయవచ్చని అనుకున్నా. కానీ, రంగంలోకి దిగిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. ధర తగ్గించినా కొనేవారు లేరు. అమ్మాయి పెళ్లి అంటే కొందరు మిత్రులు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్లాట్ల అమ్మకానికి అడ్వాన్స్ వస్తే సాయం చేస్తామని చెప్పారు. అడ్వాన్స్ ఇచ్చేవారు కాదు కదా, కనీసం ప్లాట్ల వైపు చూసే వారే లేరు’ అని తన ఆవేదనను వెలిబుచ్చారు. పైన పేర్కొన్న ఈ రెండు సంఘటనలు తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో దూసుకెళ్లిన రియల్ ఎస్టేట్ పరిస్థితి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉన్న దీనస్థితికి అద్దం పడుతున్నాయి.
రియల్ ఎస్టేట్ పడిపోవడమంటే భూములు అమ్మేవారికి, కొనేవారికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, ఉపాధి అవకాశాలకు ప్రతీక. రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మాత్రమే కాదు, ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్తబ్దత నెలకొంది.
2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాగానే కొన్ని రోజులు ఇలాగే స్తబ్దత ఏర్పడింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించగానే రియల్ ఎస్టేట్ రాకెట్లా దూసుకెళ్లింది. ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కూడా ప్రభుత్వ విధానం ఏమిటో చూద్దామన్నట్టు కొద్ది రోజులు వేచిచూశారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు మూణ్నాలుగు లక్షల రూపాయలు పలికిన ఎకరం వ్యవసాయ భూముల ధర కోటి రూపాయలకు చేరుకున్నది. అంతకుముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం. భూముల ధరలకు రెక్కలు రావడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. దాంతో ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఒక ఎకరం అమ్మి అమ్మాయి పెళ్లి చేస్తానని రైతు ధీమాగా మాట్లాడే రోజులు వచ్చాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న వ్యూహం, ప్రణాళికల వల్లనే ఇది సాధ్యమైంది. ఇలాంటి ప్రణాళికల తోనే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను తెలంగాణకు తీసుకురాగలిగారు. సొంత రాష్ట్రం కేరళలో ఇబ్బందులు పడిన వస్త్ర పరిశ్రమ యాజమాన్యాన్ని అప్పటికప్పుడు హెలీకాఫ్టర్లో నాటి పాలకులు తెలంగాణకు తీసుకొచ్చారు. వరంగల్‌లో భారీ వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయడానికి నాటి మంత్రి కేటీఆర్ చూపిన చొరవ ఎనలేనిది. ఆయన చేసిన కృషి వరంగల్‌కు వరంగా మారింది. ఒక పరిశ్రమ వస్తే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, కాంగ్రెస్‌కు ఈ విషయాల గురించిన పట్టింపే లేదు. కాంగ్రెస్ పాలకులకు ఒక ప్రణాళిక లేదు, రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనా ల గురించి ఆలోచన లేదు. ఐడీపీఎల్ వల్ల రాష్ట్రం ఔషధ పరిశ్రమల కేంద్రంగా మారింది. అలాంటి హైదరాబాద్‌కు కాదని, ఆంధ్రకు కేంద్రం ఫార్మా హబ్‌ను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఫార్మా హబ్‌ను కోల్పోయాం. కేంద్రంతో సంబంధం లేకుండానే కేసీఆర్ హయాంలో ఫార్మా సిటీ ఏర్పాటుకు భూసేకరణ పూర్తయింది. కానీ, కేసీఆర్‌పై వ్యతిరేకతతో సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. కొనసాగించి ఉంటే, వేలాది మందికి ఉపాధి లభించేది.
మరోవైపు సిమెంట్ కంపెనీ యజమానికి గన్ గురి పెట్టి కమీషన్ కోసం డిమాండ్ చేసినా చర్యలు లేవు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతున్నదని మెట్రో ఉన్నతాధికారి చెప్తే, ఆయన పారిపోకపోయి ఉంటే అరెస్ట్ చేయించేవాడినని ఢిల్లీ వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. పారిశ్రామికవేత్తలపై ఆ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో పాలకులు గుర్తించడం లేదు.
నిర్మొహమాటంగా మాట్లాడుతారని పేరున్న బజాజ్ కంపెనీ యజమాని రాహుల్ బజాజ్ ఏకంగా ప్రధాని మోదీ సమక్షంలోనే పారిశ్రామిక విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, మన సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఏకంగా అరెస్ట్ చేస్తామంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024-25లో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.14,307 కోట్లకు పడిపోయింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ. తెలంగాణ జీఎస్డీపీలో రియల్ ఎస్టేట్ వాటా 8-10 శాతం ఉంటుంది. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఉపాధి తగ్గిపోయింది. నిర్మాణాలు నిలిచిపోయాయి. కొనుగోళ్లు పడిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023లో 39,869 నిర్మాణాలకు అనుమతులిస్తే, 2024లో 14,043 అనుమతులు మాత్రమే ఇచ్చారు. అంటే 65 శాతం పడిపోయింది. ఇవన్నీ అధికారిక లెక్కలే. రియల్ ఎస్టేట్ అయి నా, స్టాక్ మార్కెట్ అయినా పెరుగుతుంటేనే పెట్టుబడులు వస్తాయి. రియల్ రంగం ప్రభావం ఐటీ ఉద్యోగాలపైనా పడింది. గతంలో ఎన్ఆర్ఐలు పెద్ద మొత్తంలో హైదరాబాద్ రియ ల్ ఎస్టేట్‌పై పెట్టుబడులు పెట్టేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ దెబ్బతినడంతో ఈ పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోయింది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లతో పాటు నిర్మాణరంగాన్ని కూల్చడంతోనే ఈ పరిస్థితి దాపురించింది.
రాచకొండలో కొత్త నగరాన్ని నిర్మిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఫ్యూచర్ సిటీ అని కొత్త రాగం అందుకున్నారు. సిటీల మాట దేవుడెరుగు కనీసం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు. పాలించేవారికి తెలంగాణ గురించి ఒక ప్రణాళిక లేకపోవడం రాష్ర్టానికి శాపంగా మారింది.