మన దేశంలో పాలకులు దీర్ఘకాల లక్ష్యాలను గొప్పగా ప్రకటించి, వాటికి విజన్ అని పేరు పెడుతుంటారు. అలాంటి లక్ష్యాలు దేశాభివృద్ధికి మంచివే. అయితే వాటి సాధనలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. వాటి ప్రచారంతోనే హంగామా చేయకుండా, నిర్దేశిత లక్ష్యాలను చేరేందుకు ప్రభుత్వాలు పట్టుదలతో పనిచేయాలి. కాలపరిమితి పది, పదిహేనేండ్లు ఉంది కదా అని నిశ్చింతగా ఉంటే లక్ష్యం కాస్తా నిర్లక్ష్యం అవుతుంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి అని చెప్పి ప్రభుత్వ విధానాలు అందుకు వ్యతిరేక దిశగా సాగితే అది ద్రోహచింతన అవుతుంది. గిరిజనాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని లక్ష్యాల్లో చూపి, అందుకు విరుద్ధంగా వారిని అడవిలోంచి నిర్వాసితులను చేస్తే ఆ విజన్ పెద్ద బూటకమే అవుతుంది. అంతేకాదు, ఆ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటుంది.
విజన్ ప్రకటించిన ప్రభుత్వం వాటి సాకార సమయం దాకా కొనసాగే అవకాశాలు తక్కువ. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 1999లో ప్రకటించిన విజన్-2020లో ఇంటికొక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తయారు చేస్తానని గ్యారెంటీగా చెప్పారు. కానీ, 2004లోనే ఆయన గద్దె దిగిపోయారు. విజన్-2020 ఏమైందని ఆయనను అడిగే అవకాశం ఇక ఉండదు. విజన్ ప్రకటన వెనుక అందాకా తన పాలన కొనసాగాలనే కాంక్ష ఆ నేత మనసులో ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 అనే డాక్యుమెంట్ విడుదల చేశారు. పది సూత్రాల ప్రణాళికతో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని తాజాగా చెప్తున్నారు. ఈ మాట వినగానే ఆయన 2020 విజన్ వైఫల్యంపై కామెంట్లు వస్తున్నాయి. విజన్ ప్రజల్లో చొచ్చుకుపోతే ఇలాంటి నగుబాట్లు తప్పవు.
వికసిత్ భారత్ 2047 ప్రకటన సందర్భంగా నీతి ఆయోగ్ మే నెలలో రాష్ర్టాల ముఖ్యమంత్రులను సమావేశపరిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆ నాటికి వందేండ్లు పూర్తి అవుతుంది కాబట్టి, అప్పటి వరకు దేశం సాధించవలసిన లక్ష్యాలు ఏమిటో అందులో పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా మార్చాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళిక సిద్ధం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి తన విజన్‌కు తెరలేపారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో, సుపరిపాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చడమే దీని ఉద్దేశమని ఆయన చెప్పారు. బడే భాయ్‌కి చోటే భాయ్ ఎక్కడా తగ్గలేదు. రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ ముఖ్యమంత్రులు ఎందరో ఇతర రాష్ర్టాల్లో ఉన్నారు. వారు కూడా తమ రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చడమే తమ లక్ష్యమని శపథం చేస్తే ఎవరు ఆ స్థానంలో ఉంటారో చెప్పలేం. అసలు విషయమేమిటంటే కేంద్రం నిధులు లేకుండా రాష్ర్టాలు విజన్లను సాధించడం కుదరని పని. వికసిత్ భారత్ 2047 అనేది పూర్తిగా నీతి ఆయోగ్ నిర్దేశిత ప్రణాళిక. ఆశించినట్టుగా కేంద్ర నిధులు అందకుంటే తెలంగాణ రైజింగ్ కుంటుపడవచ్చు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలకే కేంద్ర నిధులు, జీఎస్టీ కోటా ఎక్కువగా వెళ్తున్నాయని ప్రతి కేటాయింపు లెక్కలు చెప్తున్నాయి.
‘తెలంగాణ రైజింగ్ 2047’ను నగర, పట్టణ, గ్రామీణ అనే మూడు భాగాలుగా విభజించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ ప్రణాళికలో మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, మెట్రో రైల్ రెండో దశ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటు, చివరగా వ్యవసాయాధారిత పరిశ్రమలు ప్రాధాన్యతాక్రమంలో ఉన్నాయి. ఎన్నికల హామీలకు, వాటి అమలుకు రైజింగ్ 2047లో స్థానం లేదు.
తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ఆన్లైన్లో సిటిజెన్ సర్వే జరుగుతున్నది. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడటానికి ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాలు ఏమిటో తెలపాలని కోరుతూ అందులో ఎనిమిది ప్రశ్నలను సంధించారు. ఆరు రకాల సమాధానాలు ప్రశ్న కింద ఉన్నాయి. వాటిలో ఏవైనా మూడు జవాబులను టిక్ చేస్తే సర్వేలో పాల్గొన్నట్టే. ఈ సర్వేను ఎవరు పట్టించున్నట్టుగా లేదు. ఇప్పటికి కేవలం 3 లక్షల మంది ఇందులో పాల్గొన్నారని తెలుస్తున్నది. ఆసక్తి ఉన్నవాళ్లు తెలంగాణ రైజింగ్ 2047 సైట్‌కి వెళ్లి చూడవచ్చు. ‘నామ్ కె వాస్తే’ అన్నట్టుగా ఉన్న ఈ సర్వే వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఒక విజన్ ప్రకటించిన పాలకుడు మధ్యలోనే గద్దె దిగితే ఆయన వెంటే ఆ ప్రణాళిక కూడా మూలన పడుతుంది. గత ప్రభుత్వ కీలక నిర్ణయంగా దానిని పరిగణించి, కొత్త నేత ఆ బాటలో నడవాలని నియమమేమీ లేదు. చట్టబద్ధత లేని ఈ విజన్ పాలకుడి వ్యక్తిగతమేనా! అలాంటి దానికి ఎంతో దూరపు టార్గెట్ పెట్టుకొని గొప్పగా ప్రచారం చేయడమెందుకు? పాలనలో కొనసాగుతూ కూడా పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించని పాలకులకు మన దేశంలో కొదువ లేదు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్న కాంగ్రెస్ మాట బూటకమైంది. మూడేండ్లలో రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్న ప్రధాని తన మాట మరిచినట్టే ఉన్నారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని పాలకులు రాజకీయ ప్రయోజనాలను ఆశించి ప్రకటించే ఈ విజన్లు ప్రజల్లో భ్రమలు కల్పించేందుకే పనికొస్తాయి.