న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు పే కమిషన్ ఏర్పాటు కోసం మోదీ ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో సుమారు కోటి 15 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ వేతన సంఘం ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు పొందుతున్న వేతనాలు, సదుపాయాలు, పని పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తుంది.
కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గత జనవరిలోనే ఆమోదం తెలుపగా, ప్రస్తుతం దానికి విధివిధానాలను నిర్దేశించారు. కమిషన్‌లో చైర్‌పర్సన్‌తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫారసులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వేతన సంఘం ద్వారా లబ్ధి పొందేవారిలో 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు సుమారు 69 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుత 7వ పే కమిషన్ కాలపరిమితి 2026తో ముగియనుంది.