హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో బీజేపీ తెలంగాణ ఎంపీలు దిగిన ఫొటోలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు లేకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. బీజేపీ ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, గోడం నగేశ్‌తో కలిసి ఉన్న ఫొటోను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోకు ‘టుగెదర్‌నెస్’ అని క్యాప్షన్ ఇచ్చి కమలం పువ్వు గుర్తును ట్యాగ్ చేశారు. ఆరుగురు ఎంపీలు ఉన్న ఈ ఫొటోలో ఇద్దరు కేంద్ర మంత్రులు లేకపోవడం ఆ పార్టీలో కొత్త కుంపటికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అర్వింద్, ఈటలతో మొదటినుంచి బండి సంజయ్‌కి గ్యాప్ ఉన్నదనే చర్చ నడుస్తుంది. ఇటీవల ఈటల-బండి మధ్య రాజీ కుదిర్చేందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అభయ్‌పాటిల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ భేటీ తర్వాత కూడా బండి-ఈటల ఎక్కడా కలిసి పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రెస్మీట్లు కానీ నిర్వహించలేదు. ఇలాంటి సమయంలో ఢిల్లీ వేదికగా తామంతా ఒకటి అంటూ అర్వింద్ ట్వీట్ చేయడం అందులో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లేకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన బీజేపీ నేతల బృందంలో సైతం కిషన్‌రెడ్డి, బండి లేకపోవడం గమనార్హం.
అర్వింద్ ట్వీట్ చేసిన ఫొటోలో బీజేపీలోకి వలస వచ్చిన నేతలంతా ఉన్నారని ఆరెస్సెస్ నేపథ్యం ఉండి.. మొదటినుంచి పార్టీలో ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎక్కడ..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ర్టాభివృద్ధికి మీరు చేసింది ఏమిటి? అని ఎంపీలను నెటిజన్లు నిలదీస్తున్నారు. తెలంగాణకు బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, మెట్రో ఫేజ్-2 నిధులు, ఐటీఐఆర్, కృష్ణా జలాలకు శాశ్వత పరిష్కారంపై కేంద్రాన్ని నిలదీయాలని సూచిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే రాష్ర్టానికి మీ వల్ల ఏం ఉపయోగం అని వ్యాఖ్యానిస్తున్నారు.