బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడానికే మొగ్గు చూపుతున్నారు మరి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వెండి, బంగారు ఆభరణాల్లో చేసిన పొదుపు రూ.38,444 కోట్లకు పడిపోయింది. అలాగే 2017-18లో రూ.46,665 కోట్లను పొదుపు చేసిన దేశ ప్రజలు.. 2018-19లో రూ.42,673 కోట్లకు దాన్ని తగ్గించుకున్నారు. అయితే 2019-20లో రూ.43,136 కోట్లకు పెరిగినా.. 2020-21లో అది దాదాపు రూ.4,700 కోట్ల మేర తగ్గింది.
నిజానికి కరోనా కాలంలో సగటు పొదుపు తగ్గిపోయిందని ఎన్ఎస్ఓ నివేదిక సైతం చెప్తున్నది. అలాగే నగదు, అత్యవసర నిధి అవసరం విలువ కూడా అందరికీ తెలిసొచ్చింది. వినియోగపు అలవాట్లలో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక చాలా ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆహారం, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై వినియోగదారులు రూ.3.5 లక్షల కోట్లు అధికంగా వెచ్చించారు. కానీ రవాణా, దుస్తులు, పాదరక్షలు, రెస్టారెంట్లలో భోజనం ఖర్చులు రూ.6.1 లక్షల కోట్ల మేర తగ్గించేశారు. అయితే గత బడ్జెట్ కంటే ముందు విడుదలైన ఆర్థిక సర్వేలో భారతీయులు అత్యధికంగా క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారని తేలింది. స్టాక్ ఎక్సేంజ్ క్యాష్ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు 39 శాతం నుంచి 45 శాతానికి పెరిగాయని ఎకనామిక్ సర్వే వెల్లడించింది. ఫిబ్రవరి 2020 నుంచి స్టాక్ మార్కెట్లలోకి కొత్త ఇన్వెస్టర్ల ప్రవేశం గణనీయంగా పెరగడం కూడా రిటైల్ ఇన్వెస్టర్ల టర్నోవర్‌ను పెంచింది. గతేడాది పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన మొత్తం గత దశాబ్ద కాలంలోనే గరిష్ఠం కావడం గమనార్హం.