హైదరాబాద్, నవంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ పై ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు దేశంలోని 56 ఆర్టీసీల నుండి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా కోరుతూ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆహ్వానం అందజేసింది.
కాలుష్యం నియంత్రణ పేరుతో దేశంలో ఉన్న 1,40,000 ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం చేసి అమలు చేస్తుంది. ఇప్పటికే Fame1, FAME-2, PME-Bus, PM e డ్రైవ్ పథకాలతో, పీపీపీ మోడల్లో జీసీసీ కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేస్తూ సబ్సిడీలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో 2 వేల బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలని విధాన నిర్ణయం చేసిన సంగతి తెలిసిందే.
ఈ విధానం వల్ల ఆర్టీసీలు మరింత నష్టాల ఊబిలోకి వెళ్తాయని, భవిష్యత్‌లో ఆర్టీసీ బస్సులు కనమరుగయ్యే ప్రమాదంతో పాటు, కొత్త ఉద్యోగాల కల్పన లేకపోవడమే కాక ప్రస్తుతం ఉన్న కార్మికుల ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడనున్నదని ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, వీ.ఎస్.రావులు అన్నారు. సంస్థ మనుగడకు, కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వారు వెల్లడించారు.