Karimnagar | హైదరాబాద్ : తండ్రి మందలిస్తాడనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బోయిని సాయికుమార్ అనే విద్యార్థి గన్నేరువరం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం స్కూల్లోకి ఓ పాము ప్రవేశించింది. ఆ పామును అటెండర్ చంపేశాడు. అనంతరం చనిపోయిన పామును సాయికుమార్ తీసుకుని, ఫ్రెండ్ లంచ్ బాక్సులో ఉంచి, అతన్ని భయభ్రాంతులకు గురి చేశాడు.
ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి దృష్టికి వెళ్లింది. సాయికుమార్‌తో పాటు అతని తండ్రిని ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు పిలిపించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అయితే తన తండ్రి మందలిస్తాడనే భయంతో పురుగుల మందు సేవించాడు సాయికుమార్. అప్రమత్తమైన హెడ్ మాస్టర్, విద్యార్థులు కలిసి సాయికుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.