Eden Gardens : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న భారత జట్టు మరో సమరానికి రెఢీ అవుతోంది. స్వదేశంలో ఈమధ్యే వెస్టిండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఈసారి దక్షిణాఫ్రికా భరతం పట్టాలనుకుంటోంది. ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో మరో రెండు రోజుల్లో తొలి టెస్టు ఉన్నందున భారత క్రికెటర్లు ప్రాక్టీస్ షురూ చేశారు. మరి.. ఈడెన్‌లో ఎలాంటి వికెట్ ఉండనుంది? ఎప్పటిలానే స్పిన్నర్లకు అనుకూలిస్తుందా? అనేది చర్చనీయాంశమవుతోంది. ఈనేపథ్యంలో క్యురేటర్ సుజన్ ముఖర్జీ పిచ్ గురించి స్పష్టత ఇచ్చేశాడు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14న తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కోల్‌కతా చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ సందర్భంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి పిచ్‌ను పరిశీలించాడు. విజయంతో సిరీస్‌ను ఆరంభించాలనుకుంటున్న గిల్ టర్నింగ్ పిచ్ కావాలని అడిగాడట. ఇదే విషయమై క్యూరేటర్ సుజన్ ముఖర్జీని అడిగితే.. అవును.. తొలి టెస్టుకు తమకు టర్నింగ్ పిచ్ కావాలని అడిగారని చెప్పాడు.
Preparations in full swing as 🇮🇳 get ready to take on 🇿🇦 at Eden Gardens on Friday! #INDvsSA #IndianCricket pic.twitter.com/D8G4eVY94U
— Cricbuzz (@cricbuzz) November 11, 2025
‘కరోనా తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం స్పిన్‌కు అనుకూలించే పిచ్ తయారు చేయమని అడిగారు. కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ కోరినట్టే తాము టర్నింగ్ పిచ్ సిద్ధం చేశామ’ని సుజన్ వెల్లడించాడు. ఈడెన్‌లో పిచ్‌ను నల్లమట్టితో తయారు చేస్తారు. కాబట్టి.. ఈ పిచ్ మీద స్పిన్నర్లు మంచి బౌన్స్ రాబట్టే అవకాశముంది. రెండు, మూడో రోజు నుంచి పిచ్ నెమ్మదిస్తుంది. సో.. ఎలాగూ టర్నింగ్ పిచ్ సిద్దం చేశారు కాబట్టి.. జడేజా, కుల్దీప్, సుందర్ సఫారీలను తిప్పేయడం ఖాయం.