RS Praveen Kumar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌తో రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ ఉప ఎన్నికలో అరాచకం సృష్టించారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో డాక్టర్ దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని గత మూడు నాలుగు నెలల నుంచి ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి కుట్ర పన్నినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 40 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులం కలిసి 20 వేల బోగస్ ఓట్లను సృష్టించుకున్నారని, ఈ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని చెప్పి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఇంత వరకు బోగస్ ఓటర్లను పట్టుకోలేకపోయారు. ఇది కుట్రకు మొదటి సంకేతం. ఇక రెండో కుట్ర.. ఎన్నికల వేళ ఏదైనా ఉల్లంఘన జరిగితే సీవిజిల్ యాప్ ద్వారా వెంటనే ఫొటో తీసి వీడియో తీసి అప్లోడ్ చేయాలి. ఈ సీ విజిల్ ఈ రోజు కూడా పని చేయడం లేదు. నేను, శ్రవణ్, కౌశిక్ రెడ్డి కలిసి ఎలక్షన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాం. సీ విజిల్ యాప్ పని చేయడం లేదని చెప్పాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుందని చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇక మూడోది.. బోగస్ ఓటింగ్ జరిగే ప్రాంతాలపై ఉదాహరణలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించాం. షేక్ పేట్ డివిజన్లోని చాలా బూత్‌ల వద్ద బందోబస్తు పెట్టలేదు. బోగస్ ఓటర్లు వివరాలను లైవ్‌గా చెప్పినా కూడా పోలీసులు వారి ఆపలేదు. ఎగ్జిట్ పాయింట్ వద్ద బోగస్ ఓటర్లకు అనుమతించారు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
బోగస్ ఓటర్లు అంతా ఆటోల్లో వచ్చారు. వారి వద్ద జిరాక్స్ కాపీ ఐడీలు ఉన్నాయి. ఈ ఓటర్ పేరుకు అసలైన ఓటరు పేరుకు తేడా ఉంది. వివరాలు సరిగ్గా చెప్పడం లేదు. పోలీసులు, అధికారులు అవేమీ అడగకుండా ఓట్లు వేయిస్తున్నారు. ఇవాళ వేల బోగస్ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారు. 13 ఏండ్ల అమ్మాయితో కూడా ఓటు వేయించారు. అది అడిగినందుకు పావని గౌడ్, చింతా ప్రభాకర్ మీద దాడి చేశారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం..? బీఆర్ఎస్ నేతలకు ఒక న్యాయమా..? ఎన్నికల కమిషన్‌తో రేవంత్ రెడ్డి కుమ్మకయ్యారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. మధురానగర్ పోలీసు స్టేషన్లో బైండోవర్‌లో ఉన్న శ్రీశైలంను ఓటు వేసిన తర్వాత ఇంట్లో కూర్చోపెట్టాలి.. లేదా పీఎస్‌లో పెట్టాలి. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ నంబర్ 244 నుంచి 251 దాకా శ్రీశైలం యాదవ్ అరాచకం సృష్టించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.