హైదరాబాద్ : తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ వద్ద కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు(Rains)) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది . వీటి ప్రభావంతో హైదరాబాద్‌తో సహా పరిసర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.
గురువారం రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
గడిచిన 24 గంటల్లో అసిఫాబాద్ జిల్లాలో 2 సెం.మీ, ఆర్మూర్, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో ఒక సెం.మీ వర్షపాతం నమోదనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలకు రాబోయే నాలుగు రోజులు యెల్లో హెచ్చరికలు( Yellow Alerts) జారీచేసింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 42.3, అత్యల్పంగా రాజేంద్రనగర్‌లో 31.5 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. రాబోయే నాలుగు రోజులు హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్న తక్కువగా ఉంటాయని తెలిపారు.