Temperature | హైదరాబాద్,మే 31 (నమస్తే తెలంగాణ): దేశంలో మునుపెన్నడూ లేని విధంగా నగరాల్లో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. బెంగళూర్, చెన్నై నగరాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగాయి. నగరాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి ‘అర్బన్ హీట్-ఐలాండ్ ఎఫెక్ట్’ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే?
గ్రామీణ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత కన్నా, నగరంలో అధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడాన్ని ‘అర్బన్ హీట్ -ఐలాండ్’ ఎఫెక్ట్ అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని సహజ భూఉపరితలంతో పోలిస్తే నగరాల్లో భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉష్ణోగ్రతను ఎక్కువ గ్రహించడం వల్ల ఇది ఏర్పడుతుంది. పైగా నగరాల్లో ఏసీల వినియోగం ఎక్కువ. ఏసీల నుంచి వచ్చే వేడి కూడా అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌కు కారణమవుతుంది.
ఉపశమనం ఎప్పుడు ?
మన దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి ‘ఎల్‌నినో’ కూడా ప్రధాన కారణం. పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. ఎల్‌నినో బలహీనం కాగానే లానినా ప్రభావం మొదలవుతుంది. పసిఫిక్ సముద్రంలో వాతావరణం చల్లబడటాన్ని లానినా అంటారు. లానినా వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వర్షపాతం కూడా బాగుంటుంది. ప్రస్తుత ఎల్‌నినో 2023లో ప్రారంభమైంది. దీని ప్రభావం ఈ ఏడాది జూన్‌లో ముగుస్తుందని, తర్వాత లానినా ప్రారంభం అవుతుందని వాతావరణ శాఖ చెప్తున్నది.