e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News రామప్పకు యునెస్కో గుర్తింపు ఇలా..

రామప్పకు యునెస్కో గుర్తింపు ఇలా..

హైదరాబాద్‌ : ఎట్టకేలకు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని ఆదివారం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16న ప్రారంభమైంది. గతేడాది జూన్‌లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆదివారం జరిగిన సమావేశంలో 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు.. యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా.. భారత్‌ నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు ప్రపంచస్థాయి ఖ్యాతి లభించింది.

వ్యతిరేకించిన నార్వే.. ప్రత్యేక రూల్‌ను వాడిన రష్యా
రామప్ప ఆలయాన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ జాబితాలో జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా.. రష్యా సహా పలు దేశాలు మద్దతు తెలుపడంతో ప్రపంచ వారసత్వ స్థలంగా ఎంపికైంది. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించేందుకు తొమ్మిది లోపాలున్నట్టు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఓఎంఓఎస్-ఐకోమాస్‌‌) బృందం పేర్కొనగా.. దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను కేంద్రం వివరించింది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్లలో పరిగణలోకి తీసుకునేలా రష్యా చేసింది. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరి, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా తదితర దేశాలు మద్దతు ఇవ్వడంతో రామప్ప ఆలయానికి ప్రపంచస్థాయి ఖ్యాతి దక్కింది.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కృషి..
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఆలయానికి వారసత్వ గుర్తింపు దక్కేలా చూడాలంటూ కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సైతం గతంలో లేఖ రాశారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి దేశం నుంచి ఒకే ఒక కట్టడమైన రామప్పను యూనెస్కో వారసత్వ గుర్తింపు కోసం నామినేట్ చేసింది. యునెస్కో ప్రతినిధులు బృందం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ద్వారా ఆలయ ప్రత్యేకతలను తెలియజేస్తూ నిపుణులతో నివేదికలను సైతం పంపింది. యూనెస్కో ఆహ్వానం మేరకు.. 2019 నవంబర్‌లో తెలంగాణ నుంచి ఓ నిపుణుల బృందం ప్యారిస్ వెళ్లి.. ఆలయ ప్రత్యేకతలపై నిపుణుల సందేహాలను నివృత్తి చేసి వచ్చింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఐకోమాస్‌ బృందం రామప్ప ఆలయాన్ని పరిశీలించి వెళ్లింది.

వాసు పోష్య నందన రామప్ప ఆలయాన్ని సందర్శించి.. అణువణువూ పరిశీలించారు. శిల్ప సౌందర్యాన్ని చూసి తన్మయులైయ్యారు. నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం, సాండ్‌బాక్స్‌ టెక్నాలజీ, ఇతర ప్రత్యేకతలను గురించి తెలుసుకుని ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత సైతం ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని కోరగా.. అధికారులు పంపారు. యునెస్కో అడిగిన పూర్తి సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు.. డోసియర్ (పుస్తకం) రూపంలో యునెస్కో ప్రతినిధులకు అందజేశారు. ఇటీవలే రామప్ప విశిష్టతను తెలియచేస్తూ.. ఆరు భాషల్లో తీసిన వీడియోలను సైతం యునెస్కో ప్రతినిధులకు పంపారు. గత నెల 23న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌.. ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లి.. కేంద్రమంత్రిని సైతం కలిసి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

కాకతీయుల కళా వైభవం రామప్ప
పూర్వపు వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉన్నది ఈ రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు శివుడిపై ఉన్న అపారమైన భక్తితో కట్టించాడు. రుద్రుడి తండ్రి కాటయ. ఆయన తన హయాంలో పలు చెరువులు తవ్వించాడని రామప్ప దేవాలయ శాసనం తర్వాతిదైన గొడిశాల శాసనం (శక సంవత్సరం 1157, క్రీ.శ.1236) ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే మహాశిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. ఆలయాన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండడంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే.

సాండ్‌బాక్స్‌ టెక్నాలజీ
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేలలు ఎక్కువ బరువు ఉండే నేలలను తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక టెక్నాలజీని వాడారు. దాన్ని ప్రస్తుత ఇంజినీర్లు సాండ్‌బాక్స్‌ టెక్నాలజీగా పిలుస్తున్నారు. ఆలయం నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపరై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్ష్యా మంటపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు.

సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ, రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆలయం నలువైపులా ఉ‍న్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్‌ గ్రానైట్‌ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం
Ramappa temple : యునెస్కో గుర్తింపుపై మంత్రి కేటీఆర్‌ హర్షం
Ramappa temple : యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్‌ హర్షం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana