శ్రోత్రే హి మే సర్వే వేదా అభిసమ్పన్నాః సగ్మ్ హాస్త్మ్ర పద్యతే యం కామం కామయతే య ఏవం వేద (బృహదారణ్యక ఉపనిషత్తు అధ్యాయం 8)
శ్రోత్రేంద్రియం వల్లనే సమస్త వేదాలు సమృద్ధములు అవుతున్నాయి. కాబట్టి శ్రోత్రేంద్రియమే సద్గుణ యుక్తమని ఉపాసించేవాడు వాంఛించిన ఫలాలను పొందుతున్నాడు.. అని భావం.
చంచుల వ్యభిచారిణియైనా శివపురాణం విని, వ్యభిచారం మహా పాపమని.. నరకంలో దానికి ఘోరమైన శిక్షలు ఉంటాయని తెలుసుకొని పశ్చాత్తాపంతో పరిశుద్ధురాలైంది. ఆయుష్షు తీరి కన్నుమూసింది. శివపురాణ శ్రవణంతో కైలాసాన్ని చేరుకొని పార్వతీ దేవికి చెలికత్తె అవుతుంది. ఒకనాడు పార్వతీదేవితో ‘తల్లీ! నా పతి బిందుగుడు నాకంటే ముందే మరణించాడు. పతి సమేతంగా నిన్ను సేవించే భాగ్యం లేదా!’ అని విలపించింది. పార్వతి ‘సఖీ! నీ పతి పరమ పాపి. నరకంలో అనేక శిక్షలు అనుభవించినా పాపం తీరక పిశాచమై వింధ్య పర్వతంపై ఉన్నాడు’ అన్నది. చంచుల ‘తల్లీ! అతణ్ని పుణ్యాత్మునిగా మలుచుకోలేరా!’ అని ప్రాధేయపడింది. పార్వతీదేవి గంధర్వ రాజైన తుంబురుని రప్పించింది. ‘ఈమెతో వింధ్యగిరికి వెళ్లి ఎలాగైనా సరే ఈమె భర్తకు శివపురాణాన్ని వినిపించు..’ అని ఆదేశించింది. చంచులతో తుంబురుడు వింధ్యాద్రిపై వాలిపోయాడు.
ఆమె భర్త పగలబడి నవ్వుతున్నాడు. భోరుమని ఏడుస్తున్నాడు. దొరకకుండా ఉరుకుతున్నాడు. తుంబురుడు ఉపాసనా బలంతో అతణ్ని పట్టుకొని చెట్టుకు కట్టివేసి పురాణ ప్రవచనం ఆరంభించినాడు. దేవతలూ ఆలకించడానికి విచ్చేశారు. తుంబురుడు సప్త సంహితల శివ పురాణాన్ని గానం చేశాడు. బిందుగునికి పిశాచ రూపం మాయమైంది. ధవళ వస్ర్తాలతో దివ్యాభరణాలతో గౌరవర్ణంతో వెలిగిపోయాడు. సంస్కృతమైన ఉచ్చారణతో తానూ శివపురాణ గానంలో గొంతు కలిపినాడు. చూస్తుండగానే రుద్ర స్వరూపుడు అయ్యాడు. పార్వతీదేవి దివ్య విమానాన్ని పంపి వారిని కైలాసానికి రప్పించింది. సాష్టాంగ పడిన బిందుగుని శంకరుడు తన పార్షదునిగా తన దగ్గరే ఉండేట్టు నియమించుకున్నాడు. ఆ దంపతులు కైలాసంలో శాశ్వత నివాసం పొందారు. శివపురాణ శ్రవణం ఇలా సకల పాప హారకమై జన్మ తారకమై అలరారింది.