సిటీబ్యూరో మే 31(నమస్తే తెలంగాణ) : మూసీ నది పునర్జీవం పేరిట కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న అస్పష్టమైన విధానాలు, నిర్ణయాలు సామాన్యుడి గుండెల్లో గునపంలా దిగుతున్నాయి. నదిని ప్రక్షాళన చేయాలనే సంకల్పం మంచిదే కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలను విస్మరిస్తూ సర్కారు ఆడుతున్న దోబూచులాటపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఒకవైపు హద్దుల నిర్ధారణ పూర్తి కాకముందే నోటీసులు జారీ చేయడం, మరోవైపు బఫర్ జోన్ పరిధిపై రోజుకో మాట మారుస్తుండటంపై ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నదికి అధికారికంగా గుర్తించిన సరిహద్దు రాళ్ల నుంచి ఇరువైపులా 50 మీటర్లు అంటే దాదాపు 180 అడుగుల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ పరిగణించాలి. కానీ క్షేత్రస్థాయిలో కనీసం మద్దు రాళ్లను ఏర్పాటు ప్రక్రియే పూర్తి కాలేదు. ఎక్కడ నది ముగుస్తుంది. ఎక్కడి నుంచి బఫర్ జోన్ మొదలవుతుందో స్పష్టత లేకుండానే ప్రభుత్వం మూసీ వెంబడి ఉన్న వేలాది ఇండ్లకు, అపార్టుమెంట్లకు నోటీసులు జారీ చేయడం సర్కారు తుగ్లక్ చర్యలకు అద్దం పడుతోంది. హద్దులు నిర్ధారించకుండానే ఇండ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడం ఏ రకమైన న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
180 అడుగుల నిబంధన
నదికి ఇరువైపులా 50 మీటర్ల మేర కఠినమైన బఫర్ జోన్ పరిధిని అలాగే కొనసాగిస్తే, సామాన్యుల ఇండ్లతో పాటు, మధురిడ్జ్, కీర్తి రిచ్మండ్ వంటి రెసిడెన్షియల్, గేటెడ్ కమ్యూనిటీలు మూసీ నీటిలో కొట్టుకుపోవడం ఖాయం. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన సర్కారు.. ఇప్పుడు నది ఎకాలజీ పేరిట అడుగులు వేస్తోంది. నది హద్దు నుంచి ఇరువైపులా 50 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్‌గా నిర్ధారించే అవకాశం ఉండగా… ఈ ప్రాంతంలో నిర్మాణాలను కూల్చి అర్బన్ ల్యాండ్ స్కేపింగ్, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసమని చెప్పే అవకాశం ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న ప్రజల జీవితాలను రోడ్డున పడేసేందుకు సర్కారు సిద్ధం అవుతుంది. ఇక్కడే సామాన్యుడు పైసాపైసా కూడబెట్టి సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్న ఇండ్లను, కొనుగోలు చేసిన స్థిరాస్తులను ఇప్పుడు 180 అడుగుల నిబంధనతో కూలిపోయే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు స్థానికులకు భయాందోళనకు గురిచేస్తుంది.
సర్కారు వైఖరిలో లోపాలు..
హద్దుల నిర్ధారణ ప్రక్రియ పూర్తి కాకుండానే నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు ఎప్పుడూ కూలుస్తారో తెలియక ప్రజల్లో తీవ్ర మానసిక ఆందోళన కలిగిస్తోంది. బఫర్ జోన్ పరిధిని తగ్గిస్తామా లేదా అనే దానిపై స్పష్టత లేకపోవడం కారణంగా ఇండ్ల రీసేల్ మార్కెట్ పడిపోతుంది. అదే విధంగా బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం జరుగుతోంది. ల్యాండ్ స్కేపింగ్ విస్తీర్ణంపై మంత్రుల సబ్ కమిటీ కాలయాపన చేస్తుండగా, బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండానే ఖాళీ చేయాలనే ఒత్తిడి వస్తోంది.
తుది డిజైన్లపై ఎందుకీ జాప్యం
జనావాసాలు ఉన్న చోట 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిని కొంత మేర తగ్గించాలా? లేదా ల్యాండ్ స్కేపింగ్ విస్తీర్ణాన్ని తగ్గించుకుని ఇండ్లను కాపాడలా? అంటూ మంత్రుల సబ్ కమిటీ, అధికారులు చేస్తున్న చర్చలు కాలయాపనకే పరిమితమయ్యాయి. హద్దు రాళ్ల ఏర్పాటు ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టం తక్కువగా ఉండేలా తుది డిజైన్లను ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నా.. అంతవరకు సామాన్య ప్రజలు అనుభవించే నరకయాతనకు బాధ్యులెవరనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పర్యాటక కేంద్రాలు, అందమైన ఉద్యానవనాలు నిర్మించడం కోసం పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటిని చెల్లాచెదురు చేస్తుండటం ఏ రకమైన అభివృద్ధి అవుతుందని? బ్యూటీఫికేషన్ కంటే ప్రజల ప్రాణాలు, ఆస్తులే ముఖ్యమా? అని స్థానికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూసీ విషయంలో దోబూచులాటను పక్కనపెట్టి, జనావాసాలకు నష్టం కలిగించకుండా, మానవీయ కోణంలోనైనా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.