వీణవంక: గత ప్రభుత్వాల నిర్లక్ష్య పాలన మూలంగా చెరువులన్నీ నాశనమయ్యాయని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ తెలంగాణను ఆకుపచ్చగా తీర్చిదిద్దుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె వీణవంక మండలం కనపర్తి, రెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల మూలంగా నేడు చెరువులన్నీ బాగున్నాయి. చెరువుల కింద పంటలు బాగున్నాయి. బోరువేసే విధానానికి స్వస్తి చెప్పే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు వ్యవసాయం దండగ అనే స్థితి నుంచి నేడు పండుగ అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి. తమను విమర్శించే గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదని పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. మన పథకాలు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతున్నాయని, రైతుబంధు పథకంతో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేవారు రైతు బంధు తీసుకోవడం లేదా అని ఆమె విమర్శించారు.
ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడింది కేసీఆర్ కాదా? అని ఆమె గుర్తు చేశారు. పేదవాళ్ల కష్టం ఎక్కడ ఉంటే అక్కడ కేసీఆర్ పథకం ఉంటుంది అని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కు పద్మా దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.