(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై హైకోర్టులో గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ జరుగనున్నది. ఇదే సమయంలో తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను (Election Notification) విడుదల చేయడానికి ఈసీ అధికారులు సమాయత్తమయ్యా రు. కోర్టు తీర్పు వెలువడక ముందే అంటే గురువారం ఉదయమే ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది.
ఈసీ నోటిఫికేషన్ విడుదలయ్యాక.. కోర్టు తీర్పు భిన్నంగా వస్తే పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకొంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు స్పందించారు. ఈసీ నోటిఫికేషన్ జారీ తర్వాత ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-0లో వివరించినప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు ఉన్నదని గుర్తు చేస్తున్నారు. వార్డులు, డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల వ్యవహారాల్లో కోర్టులు నిరభ్యంతరంగా జోక్యం చేసుకోవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర, తమిళనాడులో ఈసీ నోటిఫికేషన్లపై కోర్టులు స్టే విధించిన ఘటనలను ఉదహరిస్తున్నారు.
బాంఠియా కమిషన్ సిఫారసుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2022లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ఆ ఏడాది జూలైలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, రిజర్వేషన్ల ఖరారులో బాంఠియా కమిషన్ ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అనుసరించలేదని బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన ధర్మాసనం ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌పై స్టే విధించింది. ఇక, తమిళనాడులోనూ ఇదే తరహా ఘటన జరిగింది.
2016లో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అక్కడి ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, వార్డుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయలేదని ఈసీ నోటిఫికేషన్‌పై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. దీన్నిబట్టి గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఎన్నికల నిర్వహణ అనేది కోర్టు తీర్పుకు లోబడే ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలాఉండగా.. 2022లో గోవాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా జరుగలేదని ఆరోపిస్తూ బాంబే హైకోర్టు-గోవా బెంచ్‌లో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో నోటిఫికేషన్‌పై స్టే విధించలేమని తీర్పునిచ్చింది.