హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వేకు సంబంధించిన నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. గణాంకాలను సైతం గోప్యంగానే ఉంచింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారీగా లెక్కలను బయటపెట్టింది తప్ప ఇప్పటికీ ఏవిధమైన వివరాలను వెల్లడించలేదు. కులాలవారీగా, ఉపకులాలవారీగా, గ్రామాలవారీగా, పట్టణాలవారీగా ఎవరి జనాభా ఎంతనేది స్పష్టం చేయలేదు. ఆ గణాంకాల ఆధారంగానే డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సిఫారసు చేసింది. అయితే ఆ కమిషన్ రిపోర్టును సైతం సర్కారు ఇప్పటికీ బయటపెట్టలేదు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడిదే అంశంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు పాటించకపోవడంపై నిలదీసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు నవంబర్లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల) ను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రణాళికా విభాగం మొత్తంగా మూడుదశల్లో ప్రధాన, అనుబంధ ప్రశ్నలు కలిపి 74 ప్రశ్నలతో సర్వే నిర్వహించి, డాటాను సేకరించింది. కుటుంబ పెద్ద, సభ్యుల వివరాలు మొదలు ఆ కుటుంబాల ఇంటి స్వభావం, స్థలం, వాహనాలు, వృత్తి, పశువులు, స్థిరచరాస్తులు, తాగునీటి కనెక్షన్, వంటగ్యాస్, ఇంటికోసం తీసుకున్న లోన్ తదితర వివరాలన్నింటినీ సేకరించింది.
రాష్ట్రంలో మొత్తంగా 1.15 కోట్ల కుటుంబాలను గుర్తించి, 1.12 కోట్ల కుటుంబాలను సర్వే చేసింది. పట్టణ ప్రజానీకం ఎక్కడా పూర్తిస్థాయిలో సర్వే ప్రొఫార్మాలోని ప్రశ్నలకు జవాబులు చెప్పలేదనేది వేరే విషయం. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఓ మోస్తరుగా కొనసాగిందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అరకొరగానే సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తున్నది. అయితే మొత్తం జనాభా 3.70 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది.
స్థూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలనే తెలిపింది. బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం, ఓసీలు 15.79 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా నిర్ధారించింది. గణాంకాలపై తీవ్ర వ్యతిరేకత, కులసంఘాల నుంచి అభ్యంతరాలు వెల్లడయ్యాయి. తుదకు 2025 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీ సర్వే నిర్వహించింది. అప్పటికీ అదనంగా మరో 2లక్షల మంది మాత్రమే సర్వేలో పాల్గొన్నారని తెలిపింది. అప్పుడు కూడా పూర్తిస్థాయి నివేదికను వెల్లడించలేదు. ఇదేమంటే డాటా ప్రైవసీ అంటూ దాటవేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీలు, ఇతర వెనకబడినవర్గాలకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లను కల్పించడానికి ప్రభు త్వం 2024 నవంబర్ 4న బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఈ మేరకు జీవో 49 జారీచేసింది. ఆ కమిషన్ డిసెంబర్ 5 నుంచి జి ల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించింది. ఆ తర్వాత ఇంటింటి సర్వే గణాంకాలను ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్కు ఈ ఏడాది ఫిబ్రవరి 6న అందజేసింది.
సర్కారు రీసర్వేను నిర్వహించడం ఇక్కడ గమనార్హం. సర్వే గణాంకాలను క్రోడీకరించి డెడికేటెడ్ కమిషన్ ఫిబ్రవరి 27న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకునే బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామని చెప్తూ అసెంబ్లీలో బిల్లులను పాస్చేసింది. అప్పుడు కూడా కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. తర్వాత ఆ ర్డినెన్స్లను తీసుకొచ్చింది. ఇటీవలే జీవోను జారీచేసింది. కానీ నివేదికలను వెల్లడించలేదు.
కమిషన్ ఏ ప్రాతిపదికగా సిఫారసు లు చేసిందనేది ఎవరికీ అంతుపట్టని విష యం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లోని కులాలవారీగా జనాభా వివరాలు, ఆర్థిక స్థితిగతు లు, ఏ కులం అధికంగా రాజకీయ అవకాశాలను పొందింది? ఏ కులం తక్కువ అవకాశాలను పొందింది? అనే వివరాలను ప్ర భుత్వం వెల్లడించనేలేదు. తాజాగా హైకోర్టు ఇదే విషయమై ప్రభుత్వాన్ని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. కమిషన్ నివేదికను బహిరంగపరిచారా? అభ్యంతరాలను స్వీకరించారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో గురువారం ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై సర్వ్రతా ఉత్కంఠ నెలకొన్నది.