హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ ‘కోటా’ రాజకీయం చేస్తున్నది. పరోక్షంగా ఎస్ఈసీ మీద, హైకోర్టు మీద ఒత్తిడి తేవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తమ రాజకీయ లబ్ధి కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించేందుకు, లేదా కోటా పెంచాలనుకున్నాం గానీ న్యాయ వ్యవస్థ వల్లనో, మరొకరి వల్లనో ఆగిపోయిందని చెప్పడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శిస్తున్నారు. ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అంటున్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి గురువారం ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతలంతా గురువారం భారీ ఎత్తున నామినేషన్లు వేయాలని మహేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక కార్యచరణ అమలు చేసి కాంగ్రెస్ శ్రేణులతో నామినేషన్లు వేయించాలని సూచించారు.
వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ మొదటి నుంచీ డ్రామా ఆడుతున్నదని అందరికీ తెలుసు. మొదట రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి, గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపిన సంగతి తెలిసిందే. దీనికి బీఆర్ఎస్ సైతం మద్దతు తెలిపింది. ప్రభుత్వం ఆ బిల్లులను ఢిల్లీకి పంపి చేతులు దులుపుకొన్నది. బిల్లుల ఆమోదానికిగానీ, చట్టబద్ధత కల్పించడానికిగానీ, రాజ్యాంగ సవరణ చేయించడానికిగానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కనీసం రాష్ట్రపతినో, ప్రధానమంత్రినో కలిసిన దాఖలాలు లేవు. ఆ తర్వాత అసెంబ్లీలో మరో బిల్లును పాస్ చేసింది. ప్రస్తుతం అది గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నది. ఇలా మొదటి బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉండగా, రెండోది గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నది. ప్రభుత్వం వాటిని ఆమోదింపజేసే ప్రయత్నం చేయకుండా, హడావుడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. అది చెల్లదని ప్రపంచంలో అందరికీ తెలుసని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదో కంటితుడుపుగా జీవో జారీ చేసిందని, ఆ చెల్లని జీవో ఆధారంగా నామినేషన్లు వేయమంటున్నదని చెప్తున్నారు. ఇదంతా నాటకమేనని, ఇలా ఏదో జరుగుతున్నట్టు హడావుడి చేసి, 42 శాతం అమలు చేయలేకపోయిన వైఫల్యాన్ని ఇతరుల మీద వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శిస్తున్నారు.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైనా న్యాయవివాదం ఉంటే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయదని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ విడుదల చేయాలని భావించినా, ఆ విషయాన్ని నిర్ధారించాల్సింది ఎస్ఈసీ అని గుర్తుచేస్తున్నారు. కానీ గురువారం షెడ్యూల్ విడుదలవుతుందని, పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పిలుపు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల సంఘంపై పరోక్షంగా ఒత్తిడి తేవడమేనని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ‘భారీగా నామినేషన్లు వచ్చాయి కాబట్టి ఎన్నికలు వాయిదా వేయడం సమంజసం కాదు’ అని హైకోర్టుకు విన్నవించడం ద్వారా న్యాయస్థానంపైనా ఒత్తిడి తెస్తారని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కోర్టు ప్రతికూలంగా తీర్పు ఇస్తే ‘మేం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. అమలు చేసేందుకు ప్రయత్నించాం. ఈ మేరకు నామినేషన్లు కూడా వేయించాం. కానీ కోర్టు వల్ల ఆగిపోయింది. కొందరు అడ్డుకున్నారు’ అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని అంటున్నారు.